
అభివృద్ధి పనులపై కేంద్ర బృందం ఆరా
లింగాల: మండలంలోని పద్మన్నపల్లి గ్రామాన్ని మంగళవారం కేంద్ర ప్రభుత్వ నేషనల్ లెవల్ మానిటరింగ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల అమలును బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గ్రామంలో పారిశుద్ధ్య పనులతోపాటు ఉపాధి హామీ పథకం ద్వారా అమలవుతున్న పలు రకాల పనుల గురించి ఆరాతీసింది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను గ్రామీణ ప్రజలు ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటున్నారనే విషయాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. మండల మహిళా సమాఖ్య ద్వారా అమలు జరిగే పొదుపు సంఘాల పనితీరు గురించి వివరాలు సేకరించారు. గ్రామంలో అమలవుతున్న పనులకు సంబంధించిన నివేదికలను కేంద్రానికి పంపిస్తామని బృందం వెల్లడించింది. కార్యక్రమంలో డీఎల్‌పీఓ వెంకట్‌ప్రసాద్, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఏపీడీ శ్రీనివాసులు, ఏపీఓ ఇమాంఅలీ, ఏపీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.