ఎనలేని సహకారం | - | Sakshi
Sakshi News home page

ఎనలేని సహకారం

Jul 22 2025 8:54 AM | Updated on Jul 22 2025 8:54 AM

ఎనలేన

ఎనలేని సహకారం

సంతోషంగా ఉంది..

ఆదర్శవంతమైన పీఏసీఎస్‌గా తీర్చిదిద్దడానికి నాతోపాటు మా పాలకవర్గ సభ్యులు, సీఈఓ, సిబ్బంది సమష్టిగా కృషిచేస్తున్నాం. నాబార్డు, సీడీఎఫ్‌ సహకారంతో పీఏసీఎస్‌కు నూతన భవనం, కొత్తగా గోదాంలు నిర్మించాం. రైతులకు వారి అర్హతను బట్టి అన్ని రకాల రుణాలు ఇస్తున్నాం. రుణాల రికవరీలోనూ మంచి స్థితిలో ఉన్నాం. పీఏసీఎస్‌ రెండుసార్లు రాష్ట్రస్థాయిలో నాబార్డు అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. – భూపాల్‌రావు,

పీఏసీఎస్‌ చైర్మన్‌, ఉప్పునుంతల

పెద్ద లోన్లు ఇస్తున్నారు..

పీఏసీఎస్‌లో పంట రుణాలు ఇవ్వడమే కాకుండా గేదెలు, గొర్రెల పెంపకం, కోళ్ల ఫారాల ఏర్పాటుకు పెద్ద లోన్లు కూడా ఇస్తున్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతారు. పంట పండించిన తర్వాత ధాన్యం వారే కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు క్రమం తప్పకుండా రెన్యువల్‌ చేస్తుండటంతో పంటల ఇన్సూరెన్స్‌తోపాటు వడ్డీ రాయితీ వస్తుంది. రైతులందరూ పీఏసీఎస్‌లో రుణాలు తీసుకోవడానికి ఇష్టపడతారు.

– బొల్లు శ్రీనివాసులు, రైతు, కాంసానిపల్లి

కోళ్లఫారం రుణం..

పీఏసీఎస్‌లో రెండు దఫాలుగా రూ.14 లక్షల వరకు రుణం తీసుకున్నాం. రెండు కోళ్ల ఫారాలు కట్టుకొని నడిపించుకుంటున్నాం. క్రమం తప్పకుండా కంతులు కడుతున్నాం. దాంతోపాటు పంట రుణం కూడా ఇచ్చారు. ఏదైనా అత్యవసరమైతే బంగారంపై కూడా రుణాలు ఇస్తున్నారు. మాకు అన్ని విధాలుగా రుణ సహాయం చేస్తున్నారు. ఇతర బ్యాంకుల వద్దకు రుణం కోసం వెళ్లడానికి మనసు ఒప్పదు. పీఏసీఎస్‌ మాకు ఇంటి బ్యాంకు మాదిరిగా అనిపిస్తుంది.

– మధునాగుల లక్ష్మమ్మ, మహిళా రైతు, ఉప్పునుంతల

ఉప్పునుంతల: సంఘం సభ్యులుగా ఉన్న రైతులకు విరివిగా రుణాలు ఇస్తూ.. వాటిని సకాలంలో రికవరీ చేయడం.. విత్తనాల విక్రయం, ధాన్యం కొనుగోళ్లు.. పంటల బీమా వర్తించేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అన్ని రకాల సేవలు అందిస్తూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్న ఉప్పునుంతల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) రెండోసారి రాష్ట్రస్థాయిలో ఉత్తమ పీఏసీఎస్‌గా అవార్డు అందుకొని తోటి సంఘాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా నాబార్డు అవార్డుకు ఎంపికై న ఆరు పీఏసీఎస్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉప్పునుంతల ఎంపికవడం విశేషం. అన్నదాతలకు అన్నిరకాలుగా ‘సహకారం’ అందుతుండటంతో ఇక్కడి పీఏసీఎస్‌లో రుణాలు తీసుకోవడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. 70 శాతం రుణ రికవరీతోపాటు ఇన్‌ బ్యాలెన్సింగ్‌, బ్యాంక్‌ సేవలు, రికార్డుల నిర్వహణ, పారామీటర్‌, సంఘం ప్రగతితో ఉప్పునుంతల పీఏసీఎస్‌ రాష్ట్రస్థాయిలో రెండు పర్యాయాలు నాబార్డు నుంచి అవార్డు అందుకుంది.

నష్టాల నుంచి లాభాల్లోకి..

2005కు ముందు పూర్తిగా దివాలా తీసిన ఉప్పునుంతల పీఏసీఎస్‌.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పీఏసీఎస్‌లను పటిష్టపర్చడానికి చేసిన కృషితో అంచెలంచెలుగా ఎదిగింది. ఇందులో భాగంగా 2008లో రూ.11 లక్షలతో ప్రధాన రహదారిపై శాశ్వత భవనం నిర్మించారు. అనంతరం 2014లో రూ.3 లక్షలు సీడీఎఫ్‌ నిధులతో కలిపి మొత్తం రూ.10 లక్షలతో పీఏసీఎస్‌ భవనం రెండో అంతస్తు నిర్మించారు. దీంతోపాటు గ్రామంలోని పాతకోట ప్రాంతంలో స్థలాన్ని సమకూర్చుకొని రూ.63.40 లక్షలతో 2,100 మెట్రిక్‌ టన్నుల గోదాం నిర్మించారు. ఈ గోదాంకు అనుసరించి రూ.21 లక్షలతో ఎరువులు నిల్వ చేయడానికి మరో గోదాం, ఆ తర్వాత రూ.3 లక్షల సీడీఎఫ్‌ నిధులతో విత్తనాల కోసం మరో మినీ గోదాం ఏర్పాటు చేశారు. అలాగే ఉప్పునుంతల– అచ్చంపేట ప్రధాన రహదారికి పక్కన ఉన్న సొంత స్థలంలో మరో గోదాం, ఉప్పరిపల్లి, మొల్గరలో దాదాపు 4 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించారు. మండలంలోని మొల్గర, కాంసానిపల్లి సమీపంలో రెండు పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీ సమీపంలో ఉన్న పీఏసీఎస్‌కు చెందిన స్థలంలో దాదాపు రూ.కోటికి పైగా నాబార్డు నిధులతో కొత్తగా పీఏసీఎస్‌ బ్యాంకింగ్‌ సేవల కోసం విశాలమైన నూతన భవనం రూపుదిద్దుకుంది. ఇంతకు ముందు పీఏసీఎస్‌ను కొనసాగించిన పాత భవనాన్ని ప్రస్తుతం గ్రోమోర్‌ కంపెనీకి అద్దెకు ఇచ్చి సంఘం ఆదాయ వనరుగా మార్చుకున్నారు. దీంతోపాటు రైతులకు విత్తనాలతోపాటు వారు పండించిన వరి, వేరుశనగ వంటి పంటలను పీఏసీఎస్‌ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. అన్ని రకాల వసతులను సమకూర్చుకొని రూ.3.97 కోట్ల నెట్‌ లాభంతో పీఏసీఎస్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సీఈఓ రవీందర్‌రావు పాలకవర్గాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా పీఏసీఎస్‌ అభివృద్ధికి కృషిచేస్తున్నారు.

విరివిగా రుణాలు..

పీఏసీఎస్‌లో మొత్తం 11,360 మంది రైతులు సంఘం సభ్యులుగా ఉండగా వీరికి విరివిగా పంట, దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్నారు. వాటితోపాటు బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తున్నారు. పీఏసీఎస్‌ ద్వారా రైతులకు 2025 మార్చి వరకు స్వల్పకాలిక రుణాలు రూ.29.67 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు (పాడి, కోళ్ల పరిశ్రమ, గొర్రెల పెంపకం, ట్రాక్టర్లు) రూ.21.29 కోట్లు, బంగారు ఆభరణాలపై రుణాలు రూ.9 కోట్లు ఇచ్చారు.

రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న ఉప్పునుంతల పీఏసీఎస్‌

నష్టాలను అధిగమించి

లాభాల బాటలో పయనం

విత్తనాల విక్రయం మొదలుకొని.. ధాన్యం కొనుగోళ్ల వరకు సేవలు

2008లోనే శాశ్వత భవనం,

విరివిగా గోదాంల నిర్మాణాలు

రాష్ట్రస్థాయిలో ఉత్తమ సంఘంగా నాబార్డు అవార్డుల పరంపర

ఎనలేని సహకారం1
1/3

ఎనలేని సహకారం

ఎనలేని సహకారం2
2/3

ఎనలేని సహకారం

ఎనలేని సహకారం3
3/3

ఎనలేని సహకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement