
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నాగర్‌కర్నూల్: జిల్లాలోని చెరువులు, సాగునీటి కుంటలు ప్రమాదకర స్థాయిలో ఉంటే నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి మరమ్మతు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అధిక వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి నీటిపారుదల, వ్యవసాయం, భారీ వర్షాలు, ఆరోగ్యం, రేషన్ కార్డుల పంపిణీ, తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ అమరేందర్, నీటి పారుదల సీఈ విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా సమస్యలు తలెత్తే ప్రాంతాల నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు వెంటనే స్పందించి తగిన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన సూచనలను జిల్లాస్థాయిలో అధికారులు పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు అన్ని నియోజకవర్గ స్థాయిలోని మండలాల్లో నూతన రేషన్ కార్డుల పంపిణీకి కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, పౌరసరఫరాల అధికారి నర్సింహారావు, వ్యవసాయాధికారి యశ్వంత్‌రావు, డీపీఓ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
1, 2 తేదీల్లో సీపీఐ
జిల్లా మహాసభలు
నాగర్‌కర్నూల్ రూరల్: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా కల్వకుర్తిలో వచ్చే నెల 1, 2 తేదీల్లో నిర్వహించి జిల్లా 3వ మహాసభలు విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని లక్ష్మణాచారి భవన్‌లో యేసయ్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. జిల్లా మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి హాజరవుతారన్నారు. సమావేశంలో నాయకులు ఆనంద్‌జీ, వెంకటయ్య, కేశవులు, నర్సింహ, ఇందిరమ్మ, చంద్రమౌలి, భరత్, కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.
రైతులే నడుం బిగించి.. జమ్ము తొలగించి
పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండా సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ–1 కాల్వలో నీటి పారుదలకు అడ్డంకిగా మారిన జమ్ము, పిచ్చిమొక్కల తొలగింపునకు ఆయకట్టు రైతులు నడుం బిగించారు. కాల్వలో పూడిక తీయించడంతోపాటు జమ్ము, పిచ్చిమొక్కలను తొలగించాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో రైతులే స్వయంగా రంగంలోకి దిగారు. రోజుకు కొంతమంది చొప్పున మూడు రోజులుగా కాల్వలో పెరిగిన జమ్ము, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు స్పందించి కేఎల్‌ఐ డీ–1 కాల్వకు మరమ్మతు చేయించడంతోపాటు పూడిక, జమ్ము పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి