
స్వచ్ఛతలో వెనుకంజ!
వివరాలు 8లో u
అచ్చంపేట రూరల్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏడాదికేడాది జిల్లాలోని మున్సిపాలిటీలు వెనకబడుతున్నాయి. సంబంధిత అధికారుల అలసత్వానికి తోడు ప్రజల్లో అవగాహన కొరవడటంతో మెరుగైన ర్యాంకులు సాధించలేకపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పట్టణాభివృద్ధిశాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటిస్తోంది. ఇందుకు గాను ప్రత్యేకంగా సర్వే నిర్వహించి.. పారిశుద్ధ్యం, శుభ్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు స్వచ్ఛత యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. తద్వారా ప్రతి ఒక్కరిలో పోటీతత్వం పెంచి స్వచ్ఛ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.
తిరోగమనం దిశగా..
కేంద్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి గానూ పట్టణాల్లోని జనాభా ఆధారంగా జాతీయ, రాష్ట్రస్థాయి ర్యాంకులు వెల్లడించింది. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలు గతేడాదితో పోలిస్తే చాలా వరకు వెనకబడ్డాయి. రాష్ట్రస్థాయిలో మాత్రం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ కొంత మెరుగైన ర్యాంకు సాధించగా.. మిగతా మున్సిపాలిటీలు తిరోగమనం దిశగా పయనిస్తున్నాయని స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను బట్టి చెప్పవచ్చు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మంచి ర్యాంకులు సాధించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగా పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రజల భాగస్వామ్యమేది?
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మున్సిపాలిటీ మెరుగైన ర్యాంకు సాధించడంలో అధికార యంత్రాంగంతో పాటు పట్టణ ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేకంగా స్వచ్ఛత యాప్ రూపొందించింది. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఒక మార్కు, ఫిర్యాదు నమోదైన వెంటనే పరిష్కరిస్తే రెండు మార్కులు, 6గంటల సమయం దాటిన తర్వాత సమస్యను పరిష్కరిస్తే ఒక మార్కు కేటాయిస్తారు. అయితే ఈ యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కరువైంది. స్వచ్ఛత యాప్ వినియోగం, ప్రాధాన్యతపై పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
ఏం చేయాలంటే..
జిల్లాలోని మున్సిపాలిటీల్లో స్వచ్ఛతను మెరుగు పరిచేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మన పట్టణాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో పెంపొందించాలి. బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేయకుండా చర్యలు చేపట్టాలి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడంపై గృహ యజమానులకు అవగాహన కల్పించాలి. ప్లాస్టిక్ నిషేధం వందశాతం అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పట్టణాల్లో ప్లాస్టిక్‌పై నియంత్రణ లేకపోవడంతో ప్రతినెలా టన్నుల కొద్దీ ప్లాస్టిక్ డంపింగ్‌యార్డుకు చేరుతోంది.
అచ్చంపేట మున్సిపాలిటీలో 34,500 మంది జనాభా ఉండగా, 18.79 చదరపు కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 55.19 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి ఉండగా.. 36,912 మంది జనాభా ఉన్నారు. కల్వకుర్తిలో 40వేల మంది జనాభా, 36.6 చదరపు కి.మీ. విస్తీర్ణం, కొల్లాపూర్‌లో 25,049 మంది జనాభా ఉండగా.. 20 చదరపు కి.మీ. విస్తీర్ణం కలిగి ఉన్నాయి.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దిగజారుతున్న ర్యాంకులు
గతేడాదితో పోలిస్తే చాలా వరకు వెనుకబాటు
స్వచ్ఛత యాప్ వినియోగంపై అవగాహన కరువు
ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన ర్యాంకులు సాధ్యం

స్వచ్ఛతలో వెనుకంజ!