
అతివల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
కల్వకుర్తి టౌన్/కల్వకుర్తి రూరల్: రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం పట్టణంలో ని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళాశక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీకి అద్దె బస్సులు, సోలార్ ప్లాంట్లు తదితర యూనిట్లు ఏర్పాటు చేయిస్తుందన్నారు. జిల్లాలో 5వేల మందికి ఇందిరా మహిళాశక్తి ద్వారా రుణాలు అందించడంతో వివిధ వ్యాపారాల్లో రాణిస్తున్నారని తెలిపారు. అదే విధంగా కల్వకుర్తికి మంజూరైన 2,500 రేషన్ కార్డుల్లో 5,800 మంది పేర్లను నమోదు చేశామన్నారు. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలోని 57 ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 5.47కోట్లు, 1,387 మంది ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ. 1.57కోట్ల రుణాలు, 14మంది సభ్యులకు రూ. 6.88లక్షల బీమా చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్డీఓ రాజేశ్వరి, ఆర్డీఓ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి..
భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని సూచించారు. ఏదైనా దరఖాస్తు తిరస్కరణకు గురైతే, అందుకుగల కారణాలను రాత పూర్వకంగా ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. కాగా, కల్వకుర్తి డివిజన్‌లో మొత్తం 3,126 దరఖాస్తులు అందగా.. 2,040 దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేశామని ఆర్డీఓ శ్రీను తెలిపారు. మరో 1,846 దరఖాస్తులను ఆమోదించామని.. 1,280 దరఖాస్తులను తిరస్కరించినట్లు వివరించారు.