
మహిళా సంక్షేమానికి పెద్దపీట
కందనూలు: మహిళల ఆత్మవిశ్వాసమే సమాజం పురోగతికి మూలమని.. అందుకు అనుగుణంగా మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుందని ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మహిళాశక్తి సంబురాల్లో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి వారు పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. మహిళలందరూ కోటీశ్వరులుగా మారాలనే లక్ష్యంతో అన్ని రంగాల్లోనూ ప్రోత్సాహాన్ని, అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం డ్వాక్రా పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఆ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఐకేపీగా నామకరణం చేసి మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మళ్లీ ఇప్పుడు ఇందిరమ్మ ప్రభు త్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించారు. కాగా, నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని 254 స్వయం సహాయక మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 14.22కోట్లు, 2,568 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 3.03కోట్ల రుణాల చెక్కులతో పాటు ఐదుగురు సభ్యులకు రూ. 50లక్షల ప్రమాద బీమా చెక్కు, 28 మంది సభ్యులకు రూ. 17.40లక్షల లోన్ బీమా చెక్కులను ఎమ్మెల్యేలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.