
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
కల్వకుర్తి రూరల్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెట్లు, జావెలిన్ త్రో క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్– 8, 10, 12, 14, 16, 18, 20 బాలబాలికలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. ఉత్సాహంగా పాల్గొన్నారు. వచ్చే నెల 7న నేషనల్ జావెలిన్ డే ను పురస్కరించుకొని జనగాంలో నిర్వహించే నాలుగో నేషనల్ జావెలిన్ డే వేడుకలు, కిడ్స్ అథ్లెటిక్స్ మీట్‌లో ఎంపికై న జిల్లా క్రీడాకారులు పాల్గొంటారని అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు. కాగా, ఎంపిక పోటీలను పట్టణ రెండో ఎస్‌ఐ రాజశేఖర్ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలు బహుకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీడీలు బాలసుబ్రహ్మణ్యం, ప్రసాద్, అంజయ్య, రాజు, రాజేందర్, సరస్వతి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.