
గెస్ట్ లెక్చరర్ల భర్తీకి చర్యలు
బిజినేపల్లి: పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో 2025– 26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ విద్యార్థులకు తరగతులు బోధించేందుకు ఆయా సబ్జెక్టుల్లో అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, పొలిటికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ సబ్జెక్టులకు గాను మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి సమాచారం కోసం పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాని, సెల్ నం.98484 66603ను సంప్రదించాలని సూచించారు.
ఉమామహేశ్వర ఆలయ
అభివృద్ధికి కృషి
అచ్చంపేట రూరల్: శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర ఆలయ అభివృద్ధికి తమవంతుగా కృషి చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొండదిగువన ఉన్న భోగమహేశ్వరం ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణం కోసం దేవాదాయ శాఖ నుంచి రూ.50 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ప్రత్యేక దృష్టిసారించి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖను పలుమార్లు కలిసి ఆలయ అభివృద్ధి కోసం సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించారన్నారు. నిధుల మంజూరుకు కృషిచేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణకు చైర్మన్, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
శనేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో జేష్ట్యాదేవి సమేతంగా వెలసిన శనేశ్వరుడికి భక్తులు తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం తిలతైలాభిషేకాలతో పూజలు చేశారని ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ముందుగా శనేశ్వరునికి పూజలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర పరమశివుడికి రుద్రాభిషేకాలు, పూజలు చేసిన అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆశీస్సులు అందజేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ కింద బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో మైనారిటీ విద్యార్థులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి గోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కోసం ఏదైనా రంగంలో డిగ్రీ, పీజీలో 50 శాతం మార్కులు ఉండి, 25 ఏళ్లలోపు, వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించకూడని వారు అ ర్హులన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను వచ్చేనెల 18లోగా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.