
నియోజకవర్గ కేంద్రాల్లో ఇదీ పరిస్థితి..
కొల్లాపూర్ పట్టణంలోని మూల వాగు వెంట వందల సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం నుంచి ఈ ప్రాంతంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం చాలా మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. కానీ మూలవాగు పరిసర ప్రాంతాల్లోని సర్వే నంబర్లు హైడ్రా పరిధిలో చేర్చారు. దీంతో వాగుకు వంద మీటర్ల దూరం వరకు గల ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు కట్టించుకోవడం లేదు. వాస్తవానికి డీటీసీపీ నిబంధనల ప్రకారం వాగులు, నాలాలు, కాల్వలకు బఫర్ జోన్ అంత దూరంలో ఉండదు. మూలవాగు విస్తీర్ణం రెవెన్యూ నక్ష ప్రకారం 12 ఫీట్ల నుంచి 28 ఫీట్ల వెడల్పులో మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం దీనికి 2 నుంచి 9 మీటర్లలోపు బఫర్ జోన్ ఉంటుంది. కానీ హైడ్రా యాక్ట్‌కు వీటిని అనుసంధానించడంతో ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్ స్వీకరణ జరగడం లేదు. అదే విధంగా నాగర్‌కర్నూల్‌లోని సద్దల్‌సాబ్ వాగు, నాగనూలు వాగు, కల్వకుర్తిలోని ఎర్రకుంట సమీపంలో, అచ్చంపేటలోని మల్లంకుంట సమీపంలోని ప్లాట్లకు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది.