ములుగు: పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు స్టేజీ ఏర్పాట్లు, ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని కలెక్టర్ సూచించారు. జాతీయ పతాక ఆవిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని అధికారులకు తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం పనితీరును ముందస్తుగా పరిశీలించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలని వివరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసే ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి అవసరమైన తాగునీటి సౌకర్యం, ఇతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్‌డీసీ ప్రతాప్, కలెక్టరేట్ ఏవో రాజ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్‌లో 18 పతకాలు
ఏటూరునాగారం: ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సబ్ జూనియర్, జూనియర్ క్రీడాకారులు జావెలిన్‌త్రో విభాగంలో ప్రతిభ కనబర్చి 18 పతకాలను సాధించినట్లు సోమవారం క్రీడల కోచ్ పర్వతాల కుమారస్వామి తెలిపారు. విజేతలు ఈ నెల 7, 8వ తేదీల్లో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ వివరించారు. ఈ కార్యక్రమంలో కోచ్ భావన పాల్గొన్నారు.
‘ఆపరేషన్ ముస్కాన్
విజయవంతం’
ములుగు రూరల్: జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్–2026 విజయవంతంగా పూర్తి అయినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతనెల 1 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో తనిఖీలు నిర్వహించి బాలకార్మికులు, ప్రమాదక పరిస్థితుల్లో ఉన్న 138 మంది చిన్నారులను గుర్తించినట్లు వివరించారు. వీరిలో 86 మంది బాలికలు, 52 మంది బాలురు ఉన్నట్లు వివరించారు. ములుగు డివిజన్ పరిధిలో 29 మంది, ఏటూరునాగారం డివిజన్ పరిధిలో 109 మందిని గుర్తించి తల్లిదండ్రులు లేదా సంరక్షలకు అప్పగించడంతో పాటు అవసరమైన వారికి పునరావాసం కల్పించినట్లు వెల్లడించారు. బాలకార్మికులను పనిలో పెట్టుకున్న 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. పోలీస్‌శాఖతో పాటు కార్మికశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ, బాలల సంక్షేమశాఖ, చైల్డ్‌లైన్ వారి సమన్వయంతో పని చేశామని వెల్లడించారు.
6 కిలోమీటర్లు
కాలినడకనే..
వెంకటాపురం(కె): బస్సుసౌకర్యం లేక విద్యార్థులు కాలినడకన స్కూల్‌కు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మండల పరిధిలోని అబ్బాయిగూడెం, మొర్రవానిగూడేల్లో విద్యార్థులు ఉన్నారు. మండల పరిధిలోని మొర్రవానిగూడెం, అబ్బాయిగూడెం గ్రామాల నుంచి 8 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ప్రతిరోజూ స్కూల్‌కు ఆలుబాక జిల్లా పరిషత్ పాఠశాలకు సుమారు 6కిలో మీటర్ల దూరం కాలినడకన వెళ్లాల్సి వస్తుంది. గత పది రోజులుగా స్కూల్‌కు సమయానికి బస్సులు రాక పోవటంతో కాలలినడకనే స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ విషయంపై అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


