ఏటూరునాగారం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తలపెట్టిన దేశవ్యాప్త జైల్‌భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌లు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌ఎన్ ఫంక్షన్ హాల్‌లో సీఐటీయూ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా సదస్సు జి వాసు, రఘుపతి, వెంకటరెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలలో మార్పులు చేస్తుందని తెలిపారు. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశాన్ని స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టొద్దని సూచించారు. సమ్మె హక్కును కాలరాస్తూ అనేక ఆంక్షలు విధించారని తెలిపారు. కార్మిక సంఘాల గుర్తింపు రిజిస్ట్రేషన్‌ను కష్టతరం చేశారని ఆరోపించారు. వామపక్షాల పోరాట ఫలితంగా 2005లో ఎన్‌ఆర్‌ఈజీఎస్ చట్టం వచ్చిందని దానిని ఏకపక్షంగా తొలగించి ఆస్థానంలో వీబీజీరాంజీ పేరుతో వ్యవసాయ కార్మికుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీరెడ్డి సాంబశివ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎండి. దావూద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. నీలాదేవి, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
వ్యకాస రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య


