
నేడు విద్యుత్ సరఫరా బంద్
వాజేడు: వాజేడు మండలంలో నేడు(గురువారం) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ అర్షద్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాజేడు సబ్‌స్టేషన్‌లో అదనపు లోడ్ కోసం ట్రాన్స్‌ఫార్మర్ అమర్చనున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
రైతుల సమస్యల
పరిష్కారమే లక్ష్యం
ములుగు రూరల్: రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మార్కెట్ కమిటీ పనిచేయాలని రీజనల్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ మార్కెట్ యార్డులను పునరుద్ధరించాలన్నారు. మార్కెట్ కమిటీ కార్యవర్గం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. అనంతరం రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటి డైరెక్టర్ పద్మజలను మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సోనియా, సూపర్‌వైజర్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్ రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య నియమాలు
పాటించాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ ఆరోగ్య నియమాలు పాటించాలని సింగరేణి ఆస్పత్రి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మ సూచించారు. ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులతో సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాలను తెలుసుకోవాలని సూచించారు. ప్రతీ రోజు వ్యాయామం చేయాలని, రోజుకు కనీసం 8నుంచి 9గంటల పాటు నిద్రపోవాలని చెప్పారు. పౌష్టికాహారం, విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలన్నారు. రక్తం పెరుగుదలకు ఆహారంలో పాలిష్ లేని దినుసులు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
ప్రవేశాలకు
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు ఒకటవ తరగతి ప్రవేశాలకు వచ్చే నెల 8వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్
పోటీలకు ఎంపిక
కాటారం: మండల కేంద్రంలోని ఆదర్శ హై స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అండర్–16 రన్నింగ్ విభాగంలో మొండి అనే విద్యార్థి రెండవ స్థానంలో నిలవగా అండర్–12 రన్నింగ్ విభాగంలో అవినాష్ ప్రథమ స్థానంలో, అభిరాం రెండవ స్థానంలో నిలిచి సత్తా చాటారు. హనుమకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నట్లు విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్‌రావు తెలిపారు. శాలువాలతో సన్మానించి మెమొంటో అందజేశారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఉన్నత స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు.
ఇద్దరికి రెండేళ్ల జైలు
మొగుళ్లపల్లి: మహిళను అసభ్యకరంగా తిట్టి కొట్టిన కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ భూపాలపల్లి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ జడ్జి దిలీప్‌కుమార్ నాయక్ బుధవారం శిక్ష ఖరారుచేశారు. పోలీసుల కథనం ప్రకారం..ఇప్పలపల్లికి చెందిన దూడపాక రాజు, దూడపాక సంగీతపై 2016 సంవత్సరంలో పోలీస్‌స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదుచేసింది. రాజు, సంగీతపై అప్పటి ఎస్సై రమేష్ కుమార్ కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు నిరూపణ కావడంతో దూడపాక రాజు, దూడపాక సంగీతకు శిక్ష ఖరారుచేశారు. శిక్ష పడే విధంగా ఆధారాలు సమర్పించిన ఎస్సై అశోక్, అడిషనల్ పీపీఏ కుమార్, కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ సుమలతను ఉన్నతాధికారులు అభినందించారు.