
కోలీవుడ్ స్టార్ విజయ్ 'బీస్ట్' సినిమాతోనే తెలుగులో ఫుల్ బిజీ అయిపోయానంటున్నాడు తమిళ నటుడు వీటీవీ గణేశ్ (VTV Ganesh). టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నానని చెప్తున్నాడు. తాజాగా ఇతడు తమిళ చిత్రం కిస్ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. కెవిన్, ప్రీతి అస్రాని జంటగా నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ సతీశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 19న విడుదల కానుంది.
ఒక్క డైలాగ్‌తో పాపులర్
ఈ మూవీ ప్రెస్‌మీట్‌లో గణేశ్ మాట్లాడుతూ.. బీస్ట్ సినిమాలో ఎవర్రా, నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్ అనే ఒక్క డైలాగ్‌తో నేను తెలుగు ఇండస్ట్రీలో ఫేమసయ్యాను. ఈ సినిమాలో ఛాన్సిచ్చిన విజయ్ సర్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నా.. నా గొంతే నా బలం. ఇప్పుడు తెలుగులో చిరంజీవి, నాగచైతన్య.. వంటి స్టార్ హీరోలతో దాదాపు 8 సినిమాలు చేస్తున్నాను. ఇకపోతే కిస్ మూవీ తెలుగు ట్రైలర్‌లో నా గొంతు మార్చేశారు. ఇది కరెక్ట్ కాదు.
ఈజీగా తప్పించుకుంటారు
నాకు తెలుగొచ్చు. రేపే డబ్బింగ్ చెప్పమన్నా చెప్తాను. నా వాయిస్ ఎందుకు ఉపయోగించుకోలేదని దర్శకుడిని అడిగినప్పుడు ఏమో, నాకు తెలీదు, చూద్దాం అని తప్పించుకున్నాడు. అదే లేడీ డైరెక్టర్ అయ్యుంటే సరే, నేను చెక్ చేస్తాను అని సరి చేసుకోవడానికి ప్రయత్నించేది. మేల్ డైరెక్టర్లు ఈజీగా తెలీదని తప్పించుకుంటారు అని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. గణేశ్.. తెలుగులో భగవంత్ కేసరి, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్ సినిమాల్లో నటించాడు. తమిళ 'జైలర్', 'వారసుడు', 'డాడా'(పాపా), 'ప్రిన్స్' మూవీస్‌తోనూ అలరించాడు.