ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు సౌత్‌లో రీమేక్ అయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. మన కథల్లోని కంటెంట్ నచ్చితే.. వాటిని ఇతర భాషల్లోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సౌత్ సినిమాలు బాలీవుడ్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మరో తమిళ సినిమా హాలీవుడ్ గడప తొక్కేందుకు సిద్ధమైంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం హాలీవుడ్‌లో రీమేక్ కానుంది.
నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహారాజ’ చిత్రం 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి తనదైన నటనతో మెప్పించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆయన కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది. ఇప్పటికే ఈ సినిమాను హాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటికి తెరదించుతూ ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ప్యాషన్ స్టూడియోస్’ అధికారికంగా ఈ రీమేక్‌ను ప్రకటించింది.
(ఇదీ చదవండి: ఒక్క నిర్ణయం.. త్రివిక్రమ్ జీవితాన్నే మార్చేసింది)
‘మహారాజ’ను హాలీవుడ్‌లో రీమేక్ చేయడం తమకు ప్రత్యేకమైన మైలురాయిగా పేర్కొన్న నిర్మాణ సంస్థ.. హాలీవుడ్‌లో రీమేక్ కానున్న తొలి తమిళ చిత్రంగా ఇది నిలుస్తుందని వెల్లడించింది. దీంతో తమిళ సినిమా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అయితే హాలీవుడ్ వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
(చదవండి: నేను త్రిష స్థానంలో ఉంటే అలా చేసేదాన్ని కాదు : సీనియర్ నటి అంబిక)
ఇక ఈ రీమేక్‌లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రను ఆస్కార్ అవార్డు అందుకున్న ఓ స్టార్ హీరో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ‘మాథ్యూ’ అనే హాలీవుడ్ స్టార్ పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే హాలీవుడ్ రీమేక్‌లో నటించబోయే నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.
కాగా.. విజయ్ సేతుపతి 50వ చిత్రంగా ‘మహారాజ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో పాటు పలు అవార్డులు కూడా దక్కాయి. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అంతేకాదు.. చైనాలో విడుదలైన తర్వాత అక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం విశేషం.
ఇప్పటికే ‘మహారాజ’ కథ, విజయ్ సేతుపతి నటనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ రీమేక్‌కు రంగం సిద్ధం కావడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. హాలీవుడ్ నటీనటులతో ఈ కథను ఎలా తెరకెక్కిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


