నా కలలు చిదిమేశారు, జీర్ణించుకోలేకపోతున్నా..: విఘ్నేశ్‌ | Vignesh Shivan About Negativity On Love Insurance Kompany Movie | Sakshi
Sakshi News home page

Vignesh Shivan: నా కష్టాన్ని ఎవరూ గుర్తించరు.. ఇలాంటి ముగింపు..

Jun 1 2026 10:08 AM | Updated on Jun 1 2026 10:17 AM

Vignesh Shivan About Negativity On Love Insurance Kompany Movie

వరుస బ్లాక్‌బస్టర్స్‌తో స్పీడుమీదున్న ప్రదీప్‌ రంగనాథన్‌కు ఎల్‌ఐకే (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ) పెద్ద షాకే ఇచ్చింది. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించగా అతడి భార్య, హీరోయిన్‌ నయనతార నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అట్టర్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఊహించని ఈ ఫలితానికి విఘ్నేశ్‌ విస్తుపోయాడు. కనీసం రూ.200-300 కోట్లు వసూలు చేస్తుందనుకున్నానని బాధపడ్డాడు.

నెగెటివ్‌ టాక్‌
థియేటర్లలో నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఎల్‌ఐకేపై ఎందుకు నెగెటివిటీ ప్రచారం చేశారో తెలియడం లేదు కానీ సినిమా అదిరిపోయిందని పలువురు అతడికి మెసేజ్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు విక్కీ. 'ఆన్‌లైన్‌లో ఎల్‌ఐకే మూవీపై వచ్చిన నెగెటివిటీ చూసి దీన్ని థియేటర్లలో చూడటం మిస్‌ అయ్యాం అని చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు.

కలలు నాశనం
పెద్ద తలకాయల అండదండలు లేని చిన్న సినిమాలపై కొందరు విశ్లేషకులు తమ అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. తమ రివ్యూలతో ప్రేక్షకుల్ని సినిమా చూడనివ్వకుండా నిరాశపరుస్తున్నారు. దర్శకుల కలల్ని ఆదిలోనే చిదిమేస్తున్నారు. ఫస్ట్‌ వీకెండ్‌ బలంగానే ఉన్నప్పటికీ ఈ నెగెటివ్‌ ప్రచారం సినిమాను దెబ్బకొట్టింది. సినిమా ఫలితాన్ని నేనిప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఎల్‌ఐకే అనేది ఒక విభిన్నమైన తమిళ చిత్రం. 

ఆ కష్టం ఎవరికీ కనపడదు
దీనికి ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ రావాల్సింది. ఇలాంటి సినిమా తెరకెక్కించడం వెనక ఉన్న కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఈ సినిమాను రూపొందించి, రిలీజ్‌ చేయడం వరకు ఎన్నో సవాళ్లను అధిగమించి థియేటర్లవరకు తీసుకొచ్చాను. కానీ, దానికి చివరకు ఇలాంటి ముగింపు రావడం కలిచివేసింది. అయినా కొన్ని గొప్ప సినిమాలు ఫస్ట్‌ రిలీజ్‌ అయినప్పుడు ఆదరణకు నోచుకోవు.. కానీ, తర్వాతి కాలంలో అవే క్లాసిక్‌ చిత్రాలుగా పరిగణించబడతాయి. భవిష్యత్తులో నా సినిమాకు కూడా అలాంటి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను' అని విఘ్నేశ్‌ ఎమోషనల్‌ లేఖను పంచుకున్నాడు.

చదవండి: ప్రముఖ సింగర్‌ ఇక లేరు

Advertisement
 
Advertisement
Advertisement