ఓటీటీలో సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ | Thaai Kizhavi Movie OTT Telugu Review | Sakshi
Sakshi News home page

Thaai Kizhavi Review Telugu: మహిళలు కచ్చితంగా చూడాల్సిన మూవీ

Apr 11 2026 7:02 AM | Updated on Apr 11 2026 8:44 AM

Thaai Kizhavi Movie OTT Telugu Review

ఒకప్పటి హీరోయిన్ రాధిక లీడ్ రోల్ చేసిన లేటెస్ట్ తమిళ సూపర్ హిట్ సినిమా 'తాయ్ కిళవి'. నిర్మాతల్లో హీరో శివకార్తికేయన్ ఒకరు. రూ.10 కోట్ల బడ్జెట్ పెడితే ఏకంగా రూ.81 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. థియేటర్లలో అద్భుతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మృణాల్ ఠాకుర్ రొమాంటిక్ సినిమా)

కథేంటి?
పపున్‌తాయ్(రాధిక) ఓ పల్లెటూరి బామ్మ. ఊరిలో అందరూ ఈమె దగ్గర అప్పు తీసుకుంటారు. కానీ వడ్డీ వసూలు చేయడానికి వస్తుందంటే మాత్రం అందరూ తప్పించుకుని పారిపోతుంటారు. దీంతో ఈమె ఎప్పుడు చచ్చిపోతుందా అని శాపనార్థాలు పెడుతూ ఉంటారు. మరోవైపు ఆస్తి గొడవల కారణంగా ముగ్గురు కొడుకులు ఈమెని వదిలేసి వెళ్లిపోతారు. కట్నంగా మాట్లాడుకున్న మిగిలిన బంగారం ఇవ్వలేదని అల్లుడు, ఈమె కూతురు సురులి(రైచల్ రెబెకా)ని వదిలేస్తాడు. దీంతో కూతురు, మనవడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఓ రోజు పపున్‌తాయ్‌కి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. ఏదో సైగ మాత్రం చేస్తుంటుంది. ఈమె చనిపోవడం పక్కా అనుకుని ఆస్తి పంచుకోవడానికి కొడుకులు, కోడళ్లు తిరిగొస్తారు. అయితే ఈమె దగ్గర 160 తులాల బంగారం ఉందనే రహస్యం తెలుస్తుంది. మరి ఆ బంగారం ఎక్కడుంది? దీనికోసం కొడుకులు, కోడళ్లు ఏం చేశారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడంతా డబ్బుమయం అయిపోయింది. డబ్బు లేకపోతే సొంత కొడుకులు కూడా తల్లిదండ్రులని పట్టించుకోరు. అలా డబ్బు వల్ల రోజురోజుకీ దారుణంగా మారుతున్న మానవ సంబంధాల్ని కామెడీగా, ఎమోషనల్‌గా చూపిస్తూ చివరలో అద్భుతమైన సందేశం ఇచ్చిన సినిమా 'తాయ్ కిళవి'. చూస్తున్నంతసేపు ఇది సినిమాలా అనిపించదు. మన పక్కనే ఉండే చాలామంది వ్యక్తులా జీవితంలా అనిపిస్తుంది.

మనం ఊళ్లలో చూసే గడుసు బామ్మలు ఎలా ఉంటారో పపున్‌తాయ్ కూడా అలానే ఉంటుంది. మాటతీరు, ప్రవర్తన, ఊరిలో ప్రతిఒక్కరిపై చూపించే ఆజమాయిషీ లాంటివి చూపిస్తూ ఈమె పాత్రని పరిచయం చేశారు. ఈమెకు పక్షవాతం రావడంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఆస్తి పంచుకోవాలని ఆరాటపడుతూ తల్లి ఎప్పుడు చనిపోతుందా అని ఈమె కొడుకులు, కోడళ్లు చేసే పనులు కాస్త ‍అతిగా అనిపిస్తాయి. నిజ జీవితంలో మరీ ఇలా ప్రవర్తించేవాళ్లు ఉంటారా అనిపిస్తుంది. ఎప్పుడైతే 160 తులాల బంగారం గురించి కొడుకులకు తెలుస్తుందో స్టోరీ ట్రాక్‌లో పడుతుంది. అప్పటినుంచి వచ్చే ప్రతి సీన్, చుట్టూ ఉండే పాత్రలు ప్రవర్తించే విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది.

ఫస్టాఫ్ అంతా కామెడీగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో పపున్‌తాయ్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత వైద్యులు వ్యవహరించే తీరు కూడా నవ్విస్తుంది. కానీ సమాజంలో జరుగుతున్న పలు విషయాల్ని గుర్తుచేస్తాయి. చివరగా ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత బామ్మ తన సైగలకు అర్థం చెప్పినప్పుడు ఇదెక్కడి ట్విస్ట్ రా బాబోయ్ అనిపిస్తుంది. నిజంగా ఈమె దగ్గర అంత బంగారం ఉందా లేదా అనే సీన్ ఆకట్టుకుంది. అలానే మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఎలా బతకాలో పపున్‌తాయ్, ఆమె కూతురితో చెప్పించే సీన్స్ అయితే భావోద్వేగానికి గురిచేస్తాయి. వీటికి ప్రతి మహిళ కనెక్ట్ అవుతుంది. అన్ని ప్లస్సులేనా మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. కాకపోతే చాలా తక్కువగానే ఉన్నాయి.

ఎవరెలా చేశారు?
పపున్‌తాయ్ అనే వృద్ధురాలిగా రాధిక అదరగొట్టేసింది. ప్రారంభంలో పది నిమిషాలు, చివరి అరగంట మాత్రమే ఈమె కనిపిస్తుంది. కానీ గెటప్, క్లైమాక్స్‌లో ఈమె చెప్పే డైలాగ్స్ సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. మిగతా నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. కానీ మూవీ చూస్తున్నంతసేపు అదేం పెద్ద సమస్యగా అనిపించదు. ఫస్టాప్ లో కాస్త అతి అనిపిస్తుంది కానీ కథలో లీనమైన తర్వాత అవేం పెద్దగా గుర్తుండవు. కమల్ హాసన్ పాటల రిఫరెన్స్‌లతో వచ్చే హంగామా కూడా అలరించింది.

'జీవితంలో ఎవరైనా డబ్బు అవసరం లేదని అంటే వాళ్లు డబ్బు సమస్య లేకుండా బతుకుతున్నారని అర్థం. అలాంటి వాళ్ల మాటలు విని మీరు కూడా అలా బతికితే.. అమ్మ నగలు దాచిపెట్టిందా? నాన్న ఆస్తి రాకపోతుందా? అని ఎదురుచూడాల్సి వస్తుంది' అని బామ్మ చెప్పే డైలాగ్.. మనిషికి డబ్బు ఎంత అవసరమో చెప్పకనే చెబుతుంది. డైరెక్టర్ శివకుమార్ మురుగేశన్ రాసుకున్న స్టోరీ గానీ తీసిన విధానం గానీ సూపర్. సాంకేతికంగానూ మూవీ బాగుంది. ప్రస్తుతం హాట్‌స్టార్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి చూడొచ్చు. వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్.

- చందు డొంకాన

(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement