Sushmita Sen: సుష్మితతో పాక్‌ క్రికెటర్‌ సహజీవనం, అంతలోనే అనుమానాలు!

Sushmita Sen Cricketer Wasim Akram Breakup Love STory In Telugu - Sakshi

క్రికెట్, సినిమాకున్న  క్రేజ్‌ ఎలాంటిదంటే.. పచ్చగడ్డిని భగ్గున మండించే వైరాన్ని కూడా పక్కకు తోసేసి ప్రేమించేలా చేస్తుంది! మన బాలీవుడ్, పాక్‌ క్రికెట్టే దీనికి ఉదాహరణ! ఆ ఆటగాళ్లు.. ఈ తారల మధ్య నడిచిన ప్రేమ కథలే ప్రత్యక్ష సాక్ష్యాలు! అవునవును.. జీనత్‌ అమన్‌ – ఇమ్రాన్‌ ఖాన్, రీనా రాయ్‌ – మొహ్‌సిన్‌ ఖాన్‌... వీళ్ల సరసన ఉన్న మరో జంటే  సుష్మితా సేన్, వసీమ్‌ అక్రమ్‌! ఆ ఇద్దరిదే ఈ మొహబ్బతే అని అర్థమయ్యే ఉంటుంది.

‘విశ్వ సుందరి’ కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది సుష్మితా సేన్‌. ఆ ఆకర్షితుల్లో వసీమ్‌ అక్రమ్‌ కూడా ఉన్నాడు. క్రికెట్‌లో ఆల్‌ రౌండర్‌ వసీమ్‌ అక్రమ్‌కు జగమంతా అభిమానులున్నారు. అందులో సుష్మితా సేన్‌ ఉందో లేదో తెలియదు కానీ.. అతని పేరు మాత్రం ఆమెకు తెలుసు. అందాల పోటీల తర్వాత సుష్మితా నేరుగా సినిమా రంగంలో ల్యాండ్‌ అయింది. తెర మీద కనిపించిన సుష్మితాకూ, ఆమె నటనకూ అభిమానిగా మారాడు వసీమ్‌. అప్పటిక్కూడా ఆ ఇద్దరికీ ముఖాముఖి పరిచయం లేదు. సినిమా, క్రికెట్‌ ఈవెంట్లలో కలవలేదు.

మరి ఎక్కడ కలుసుకున్నారు?
‘ఏక్‌ ఖిలాడీ ఏక్‌ హసీనా’ సెట్స్‌లో. అది సినిమా కాదు. ఓ ప్రైవేట్‌ చానెల్లో ప్రారంభమైన రియాలిటీ షో. దానికి న్యాయనిర్ణేతలుగా సుష్మితా సేన్, వసీమ్‌ అక్రమే వ్యవహరించారు. ఆ షూటింగ్‌లోనే ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆమె మీద అతనికున్న అభిమానాన్ని ఆ సందర్భంలోనే ఆమెతో చెప్పాడు అతను. అతని ఆదరాన్ని ఆమె స్వీకరించింది. ఆ రియాలిటీ షోతో వాళ్ల మధ్య స్నేహం కుదిరింది. వాళ్లు హాజరవ్వాల్సిన ఫంక్షన్లు, పార్టీలకు కలసే వెళ్లడం.. జంటగా కనిపించడం మొదలుపెట్టారిద్దరూ. దాంతో వాళ్ల మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందనే గుసగుసలు వినిపించసాగాయి బాలీవుడ్‌లో. దాన్ని మీడియా మరింత ముందుకు తీసుకెళ్లింది.. ఆ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారంటూ. ఆ ప్రచారాన్ని కానీ.. మీడియా కథనాన్ని కానీ ఆ జంట కలసి కానీ.. విడివిడిగా కానీ ఖండించలేదు. అసలు వాటిని వాళ్లు పట్టించుకోనే లేదు. వీళ్ల మౌనాన్ని తమ కథనానికి అంగీకారంగా అనుకుందో ఏమో మరి ఆ జంట త్వరలోనే పెళ్లీ చేసుకోబోతోందనే వార్తనూ వ్యాప్తి చేసింది మీడియా. అప్పుడు ఉలిక్కిపడ్డారు ఆ ఇద్దరూ.

‘వసీమ్‌ అక్రమ్‌కు, నాకూ పెళ్లంటూ వస్తున్న వార్తలను చదివాను. అందులో రవ్వంత కూడా నిజం లేదు. ఇలాంటి విషయాలను పత్రికల్లో చదివినప్పుడు, టీవీ చానళ్లలో చూసినప్పుడే అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు మీడియా ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందోనని. ఇలాంటి వార్తల వల్ల కుటుంబాలు కూలిపోతాయి. వసీమ్‌ అక్రమ్‌ నాకు మంచి స్నేహితుడు. అద్భుతమైన సహధర్మచారిణితో చక్కటి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇలాంటి వార్తలతో వాళ్ల కాపురంలో కలతలు రేపొద్దు. ఇంకో విషయం.. నా జీవితాన్ని పంచుకునే తోడు దొరికినప్పుడు ఆ విషయం మొదట మీకే చెప్తాను’ అంటూ ట్విట్టర్‌లో తన స్పందనను తెలియజేసింది సుష్మితా.

అటు వసీమ్‌ అక్రమ్‌ కూడా ‘ఈ వదంతులు వినీ వినీ విసుగొచ్చేసింది.  ‘మరో పెళ్లి’ గురించిన ఆలోచనలు నాకు లేవు. నా ఫోకస్‌ అంతా నా పిల్లల (ఇద్దరు అబ్బాయిలు) మీదే. వాళ్లు పెద్దవాళ్లవుతున్నారు. తండ్రిగా నా అవసరం వాళ్లకిప్పుడు ఎంతో ఉంది. అందుకే ఏడాది పాటు ఐపీఎల్‌ నుంచి కూడా  విరామం తీసుకుని నా పిల్లలతో  క్వాలిటీ టైమ్‌ స్పెండ్‌ చేయాలనుకుంటున్నాను’ అంటూ తన మనసులో మాటను మీడియాకు స్పష్టం చేశాడు. 

నాకు వసీమ్‌ అంటే చాలా ఇష్టం.. ఓ స్నేహితుడిగా మాత్రమే. నా దృష్టిలో రిలేషన్‌షిప్‌ అనేది బిగ్‌ డీల్‌. నిజంగానే నా జీవితాన్ని పంచుకునే తోడు దొరికినప్పుడు మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఇలా మీ ఊహలకు వదిలేయను
– సుష్మితా సేన్‌

అయితే... ఒక పత్రిక (హిందుస్థాన్‌ టైమ్స్‌) కథనం ప్రకారం.. 
‘ఏక్‌ ఖిలాడీ ఏక్‌ హసీనా’ మొదలైన కొన్నాళ్లకు అంటే 2009లో వసీమ్‌ భార్య హుమా చనిపోయింది. అతను విషాదంలో మునిగిపోయాడు.. దిగులుతో కుంగిపోయాడు. ఆ బాధను పంచుకుంటూ వసీమ్‌కు సొలేస్‌ అయింది సుష్మితా. ఆమె స్వాంతనతో వసీమ్‌ ఊరట చెందాడు. అది ప్రేమగా మారింది. సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా సేన్‌ షెడ్యూల్‌ వల్ల వసీమ్‌ అక్రమ్‌ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్‌ అయింది. కొన్నాళ్ల తర్వాత..  సుష్మితా సేన్‌ .. ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది.  వసీమ్‌ అక్రమ్‌ ఓ అస్ట్రేలియన్‌ మోడల్‌ని పెళ్లి చేసుకున్నాడు.
- ఎస్సార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top