టాలీలో మాలీ హవా

Special focus on Telugu films by Mollywood actors - Sakshi

‘ప్రతిభకి భాషతో సంబంధం లేదు’ అనే మాట చిత్ర పరిశ్రమలో తరచుగా వినిపిస్తుంటుంది. టాలెంటెడ్‌ ఆర్టిస్ట్‌లు ఏ భాషలో ఉన్నా తెలుగు పరిశ్రమ సాదర స్వాగతం పలుకుతుంది. ప్రస్తుతం తెలుగులో సెట్స్‌పై ఉన్న పలు చిత్రాల్లో జయరామ్, పృథ్వీరాజ్‌ సుకుమారన్, ఫాహద్‌ ఫాజిల్, దేవ్‌ మోహన్, జోజూ జార్జ్, సుదేష్‌ నాయర్‌.. వంటి పలువురు మలయాళ నటులు కీలక పాత్రలతో హవా సాగిస్తున్నారు. ఈ మాలీవుడ్‌ నటులు చేస్తున్న తెలుగు చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

బిజీ బిజీగా...
‘భాగమతి.. అల వైకుంఠపురములో, రాధేశ్యామ్, ధమాకా... ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేశారు మలయాళ సీనియర్‌ నటుడు జయరామ్‌.  నెగటివ్, పాజిటివ్‌ క్యారెక్టర్స్‌తో
తెలుగులో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శ కత్వం వహిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’తో పాటు మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో జయరామ్‌ కీలక పాత్ర చేస్తున్నారు.  

అదిరే ఎంట్రీ
మలయాళం స్టార్‌ హీరోల్లో ఒకరైన ఫాహద్‌ ఫాజిల్‌ ‘పార్టీ లేదా పుష్పా..’ అంటూ తెలుగులోకి అడుగుపెట్టారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రతో అదిరే ఎంట్రీ ఇచ్చారు ఫాహద్‌. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప 2: ది రూల్‌’ చిత్రంలోనూ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రలో నటిస్తున్నారు ఫాహద్‌ ఫాజిల్‌. ‘పుష్ప’ మొదటి భాగంలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్నా రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయిలో ఉంటుందని టాక్‌.

పదమూడేళ్ల తర్వాత...
మాలీవుడ్‌లో ఓ వైపు స్టార్‌ హీరోగా దూసుకెళుతూ మరోవైపు డైరెక్టర్‌గా (లూసిఫర్, బ్రో డాడీ) ప్రతిభ చూపిస్తున్నారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. కాగా మన్మోహన్‌ చల్లా దర్శకత్వం వహించిన ‘పోలీస్‌ పోలీస్‌’ (2010) చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్‌. ఆ చిత్రంలో ఓ హీరోగా నటించిన ఆయన పదమూడేళ్ల గ్యాప్‌ తర్వాత మరో తెలుగు చిత్రంలో (‘సలార్‌’) నటిస్తున్నారు. ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ విలన్‌గా నటిస్తుండగా ఆయన తనయుని పాత్రలో పృథ్వీరాజ్‌ నటిస్తున్నారట. పృథ్వీ పాత్ర నెగటివ్‌ టచ్‌తో ఉంటుందని టాక్‌. సెప్టెంబర్‌ 28న ‘సలార్‌’ విడుదల కానుంది.  

‘శాకుంతలం’తో వచ్చి...
గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘శాకుంతలం’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు దేవ్‌ మోహన్‌. మలయాళంలో నటించింది కొన్ని సినిమాలే అయినా తొలి తెలుగు చిత్రంలోనే సమంత వంటి స్టార్‌ హీరోయిన్‌కి జోడీగా నటించే అవకాశం అందుకున్నారు దేవ్‌ మోహన్‌. ఈ సినిమాలో దుష్యంత మహారాజుగా నటించి, మెప్పించారు దేవ్‌. ఇలా ‘శాకుంతలం’తో తెలుగుకి వచ్చి, రెండో తెలుగు
సినిమా ‘రెయిన్‌బో’లోనూ మరో స్టార్‌ హీరోయిన్‌ రష్మికా మందన్నాకి జోడీగా నటించే చాన్స్‌ అందుకున్నారు దేవ్‌. శాంతరూబన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.  

జోజు.. సుదేష్‌ కూడా...
మలయాళంలో నటుడిగా, నిర్మాతగా, గాయకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జోజూ జార్జ్‌ ‘ఆది కేశవ’ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విలన్‌గా  నటిస్తున్నారు జోజూ. అలాగే నితిన్‌ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా సుదేష్‌ నాయర్‌ తెలుగుకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్‌. ఈ చిత్రంలో ఆయన స్టైలిష్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తారట.  

వీళ్లే కాదు.. మరికొందరు మలయాళ నటులు కూడా తెలుగు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top