
ప్రముఖ సింగర్ కల్పన తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. కొద్దిరోజుల క్రితం ఆమె అధిక మోతాదులో నిద్ర మాత్రలు తీసుకొని అపస్మారక స్థితిలోకి వెల్లిన విషయం తెలిసిందే. దీంతో ఆమె భర్తపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కల్పన స్పందించారు. తన భర్తపై మీడియాలో ఎలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయకండి అంటూ ఆమె రిక్వెస్ట్ చేశారు. కేవలం పని ఒత్తిడి వల్ల నిద్ర పట్టకపోవడంతోనే టాబ్లెట్స్ వేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
'నన్ను కాపాడిన మీడియా, పోలీసులకు కృతజ్ఞతలు. స్ట్రెస్ వల్ల గత కొద్దిరోజుల నుంచి నాకు సరిగ్గా నిద్రపట్టడం లేదు. అందువల్లే ట్యాబ్‌లెట్స్ వేసుకున్నాను. అయతే, అది డోస్ ఎక్కువ కావడం వల్లే ఇలా జరిగింది. కానీ, మీడియాలో నాతో పాటు నా భర్త గురించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలని ఆసుపత్రి నుంచే మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు పూర్తి క్షేమంగా ఉన్నాను. ప్రస్తుతం 45 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నాను. ఇదంతా నా భర్త ప్రసాద్ ప్రభాకర్ ప్రోత్సాహం వల్లే జరుగుతుంది. చాలా రోజులుగా మ్యూజికల్ ప్రోగ్రామ్స్‌లలో పాల్గొనడంతో నిద్ర పట్టడం లేదు. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. అందుకోసం వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నాను.
వారు సూచించిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం కాకుండా ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే స్పృహ తప్పి పడిపోయాను. ఆ సమయంలో నా భర్త కేరళలో ఉండటం వల్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై కాలనీవాసుల, మీడియా సహాయం వల్ల నేను మీ ముందు క్షేమంగా ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మీ ముందుకు వస్తాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త ప్రసాద్ ప్రభాకర్. ఆయనతో పాటు నా కూతురు సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు.. ఎవరూ తప్పుడు ప్రచారం చేయకండి ప్లీజ్.. నా క్షేమం కోరుకున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు' అని ఆమె తెలిపారు.