Escaype Live Review In Telugu: సిద్ధార్థ్‌ 'ఎస్కేప్ లైవ్‌' వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. ఎలా ఉందంటే ?

Siddharth Escaype Live Web Series Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: ఎస్కేప్‌ లైవ్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌)
నటీనటులు: సిద్ధార్థ్‌, ఆకాంక్ష సింగ్‌, సుమేధ్‌ ముద్గాల్కర్‌, రిత్విక్‌ సాహోర్, ఆద్య శర్మ, ప్లబితా, రోహిత్ చందేల్‌, జావేద్‌ జాఫెరి తదితరులు
దర్శకత్వం: సిద్ధార్థ్ కుమార్‌ తవారీ
విడుదల తేది: మే 20 (7 ఎపిసోడ్స్‌) & మే 27 (2 ఎపిసోడ్స్‌)
ఓటీటీ: డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

టాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. 'బొమ్మరిల్లు'తో సూపర్‌ హిట్‌ కొట్టిన సిద్ధార్థ్‌ చాలా గ్యాప్‌ తర్వాత 'మహాసముద్రం' సినిమాతో అలరించాడు. ఈ యంగ్‌ హీరో తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్‌ ఓటీటీ డెబ్యుగా వచ్చిన వెబ్‌ సిరీస్‌ ఎస్కేప్‌ లైవ్‌. సిద్ధార్థ్‌ కుమార్ తివారి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ స్పెషల్స్‌ నిర్మించింది. మే 20న విడుదలైంది. రీల్స్‌, సోషల్‌ మీడియాతో వచ్చే డబ్బు కోసం యువత ఏం చేస్తుందనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ 'ఎస్కేప్‌ లైవ్‌' వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథ:
బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కృష్ణ స్వామి తల్లి, చెల్లితో కలిసి నివసిస్తాడు. తండ్రి లేకపోవడంతో కుటుంబ బాధ్యతలను తీసుకుంటాడు. తన అర్హతకు తగిన ఉద్యోగం దొరక్కపోవడంతో 'ఎస్కేప్‌ లైవ్‌' అనే వీడియో షేరింగ్‌ యాప్‌లో మోడరేటర్‌గా జాయిన్‌ అవుతాడు. ఎస్కేప్‌ లైవ్‌ యాప్‌ తన పాపులారిటీ పెంచుకునేందుకు ఒక కాంటెస్ట్‌ నిర్వహిస్తుంది. యాప్ యూజర్స్‌ వివిధ రకాల వీడియోలు చేసి అప్‌లోడ్‌ చేస్తే వారికి డైమండ్స్ వస్తాయి. అవి క్యాష్‌ రూపంలో వారి అకౌంట్‌కు చేరతాయి. ఈ క్రమంలోనే ఒక డేట్‌ వరకు ఎక్కువ డైమండ్స్‌ గెలుచుకున్న వారికి రూ. 3 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తామని ప్రకటిస్తారు ఎస్కేప్‌ లైవ్‌ నిర్వాహకులు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న యాజర్స్‌ ఆ డబ్బు కోసం ఎంతకు తెగించారు ? యాప్‌ కాన్సెప్ట్ నచ్చని కృష్ణ ఏం చేశాడు ? ఆ సమయంలో కృష్ణ ఎదుర్కున్న పరిస్థితులు ఎంటీ ? అందులో పాల్గొన్న ఐదుగురు కంటెస్టెంట్‌లు చివరికి ఏమయ్యారు ? ఆ రూ. 3 కోట్లను ఎవరు గెలుచుకున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ సిరీస్‌ చూడాల్సిందే.

విశ్లేషణ: 
ప్రస్తుతం యూత్‌ ఫాలో అవుతున్న రీల్స్‌, టకా టక్‌, జోష్‌, మోజో, చింగారీ వంటితదితర యాప్స్‌ యూత్‌ను, పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయో కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్‌ సిద్ధార్థ్‌ కుమార్ తివారీ. నిత్యం సమాజంలో చూసే అనేక విషయాలను సిరీస్‌ ద్వారా చూపించారు. సోషల్ మీడియాతో మనీ, ఫేమ్ సంపాదించుకోవాలనుకున్న యువత ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది ? చివరికీ ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తీసుకున్నారు డైరెక్టర్‌. ఆయన అనుకున్నది ప్రేక్షకులకు చూపించడంలో కూడా సక్సెస్‌ అయ్యారు. అంతేకాకుండా ఇందులో ఒక పాత్రలో కూడా నటించారు సిద్ధార్థ్‌ కుమార్ తివారీ. సిరీస్‌లోని 5 ప్రధాన పాత్రలు, వారి నేపథ్యాన్ని చూపిస్తూ ప్రారంభించారు. అది కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. కానీ కథ పరంగా అలా చూపించడం తప్పదు. 

ఇక ఎస్కేప్‌ లైవ్‌ యాప్‌ కాంటెస్ట్‌ కోసం ఐదుగురు చేసే ప్రయత్నాలు, వారి జీవిత కథలు ఆకట్టుకుంటాయి. యాప్‌ ఎదుగుదల కోసం కార్పొరేట్‌ సంస్థలు ఏం చేస్తాయనే విషయాలు బాగా చూపించారు. సిరీస్‌లో అక్కడక్కడా వచ్చే అశ్లీల సన్నివేశాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ అవి రియల్‌ లైఫ్‌లో జరిగే సంఘటనలని ఒప్పుకోక తప్పదు. నైతికత విలువలతోపాటు జెండర్‌ వివక్షతను చూపించారు. మంచి థ్రిల్లింగ్‌గా సాగుతున్న స్టోరీలో అక్కడక్కడా కుటుంబంతో ఉన్న ప్రధాన పాత్రల సన్నివేశాలు (ఎపిసోడ్‌ 5) కొద్దిగా బోర్‌ కొట్టిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తోపాటు అప్పుడప్పుడు వచ్చే పాటలు ఆకట్టుకున్నాయి. 

ఎవరెలా చేశారంటే?
సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సాంప్రదాయ కుటుంబంలో పెరిగిన యువకుడిగా, యాప్‌ నిర్వాహకులు చేస్తున్న పని నచ్చని, దాన్ని ఆపాలనే సిటిజన్‌గా బాగా నటించాడు. అయితే మిగతా ఐదు ప్రధాన పాత్రలతో పోల్చుకుంటే సిద్ధార్థ్‌ క్యారెక్టర్‌ డెప్త్‌ తక్కువగా అనిపిస్తుంది. తన సిస్టర్‌ బాయ్‌ఫ్రెండ్‌ విషయంలో సిద్ధార్థ్‌ చేసే పని కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇక మిగతా క్యారెక్టర్లైనా డ్యాన్స్‌ రాణి (బేబీ ఆద్య శర్మ), ఫెటీష్‌ గర్ల్‌ (ప్లబితా), ఆమ్చా స్పైడర్‌ (రిత్విక్ సాహోర్‌), రాజ్‌ కుమార్‌ రోహిత్‌ చందేల్‌ నటన సూపర్బ్‌గా ఉంది. ముఖ్యంగా ఆద్య శర్మ డ్యాన్స్‌లు బాగా ఆకట్టుకుంటాయి. 

ఇక సైకో వ్యక్తిగా డార్క్‌ ఏంజిల్‌ పాత్రలో సుమేధ్‌ ముద్గాల్కర్‌ అదరగొట్టాడు. సిరీస్‌కు అతడి యాక్టింగ్‌ హైలెట్‌ అని చెప్పవచ్చు. రాధా క్రిష్ణ సీరియల్‌లో కృష్ణుడిగా సుమేధ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇందులో రాధగా నటించిన మల్లికా సింగ్‌ కూడా సిద్ధార్థ్‌ చెల్లెలుగా శ్రీని పాత్రలో అలరించింది. పోలీస్‌ ఆఫిసర్‌గా ఆకాంక్ష సింగ్‌ పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఫైనల్‌గా సిరీస్‌ గురించి చెప్పాలంటే కొంచెం ఓపిక తెచ్చుకోనైన సరే కచ్చితంగా చూడాల్సిన వెబ్‌ సిరీస్ ఇది. చివరి ఎపిసోడ్‌లో కొన్ని విషయాలకు క్లారిటీ ఇవ్వకుండా రెండో సీజన్‌ కూడా వస్తుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. 

-సంజు (సాక్షి వెబ్‌డెస్క్‌)

Rating:  
(3/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top