
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.
ఈ సినిమాలో శ్రియ శరణ్ పోషించిన అంబిక పాత్రని పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను మంగళవారం విడుదల చేసింది యూనిట్. ‘‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు తేజ సజ్జా. ఈ సినిమాలో తేజ తల్లి పాత్రలో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటించారు శ్రియ. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్‌తో ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.
మిరాయ్ ట్రైలర్ బాగుంది – రజనీకాంత్
‘‘మిరాయ్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది’’ అని హీరో రజనీకాంత్ పేర్కొన్నారు. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించారు. సోమవారం ఈ సినిమా ప్రెస్‌మీట్‌ని చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ని కలిసి, ‘మిరాయ్’ ట్రైలర్ చూపించారు మనోజ్. ‘‘మిరాయ్’ ట్రైలర్ చూస్తుంటే సినిమాని గ్రాండ్ స్కేల్‌లో నిర్మించారని తెలుస్తోంది. మనోజ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉందని అర్థం అవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి... యూనిట్‌కి అభినందనలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. ‘‘మిరాయ్’ మూవీతో రజనీకాంత్‌గారి ఆశీర్వాదాలు నాకు దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మంచు మనోజ్.