
రెండు దశాబ్దాల పాటు కథానాయకిగా వెలిగిన నటి శ్రియ( Shriya Saran). 2001లో ఇష్టం సినిమాతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఆ తర్వాత తమిళ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రజనీకాంత్, విజయ్, విక్రమ్, ధనుష్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. సౌత్ ఇండియాలో పలు స్టార్ హీరోలతో జతకట్టి విజయాలను అందుకున్నారు. ఆమధ్య తన చిరకాల మిత్రుడు ఆండ్రు కోచ్చోను వివాహమాడి సంసార జీవితంలోకి అడుగుపెట్టారు.
అయినప్పటికీ నటనను మాత్రం వీడలేదు అడపాదడపా నచ్చిన పాత్రల్లో నటిస్తూనే ఉన్నారు. అయితే కథానాయకిగా మాత్రం రావడం లేదు అన్నది వాస్తవం. పలు చిత్రాల్లో ప్రత్యేక పాటల్లోనూ నటించిన శ్రియ ఇటీవల సూర్య కథానాయకుడుగా నటించిన రెట్రో చిత్రంలో ప్రత్యేక పాటలో మెరిశారు. అదేవిధంగా తాజాగా మిరాయ్ చిత్రంలో చాలా కీలక పాత్రను పోషించారు. దీంతో శ్రియ ఇకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమవుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ఆమె అభిమానులకు నచ్చే విధంగా నటిస్తే వారు మనల్ని ఇష్టపడతారని పేర్కొన్నారు. అందుకే ఇకపై అభిమానులకు నచ్చే విధంగా పాత్రను ఎంపిక చేసుకుని నటిస్తానని చెప్పారు. అయితే 43 ఏళ్ల వయసులోనూ శ్రియ తన అందాలను కాపాడుకుంటూ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉండడం విశేషం.