ది ఒడిస్సీకి మిస్‌... వారణాసికి ప్లస్‌? | Shortage of IMAX screens for The Odyssey in Hyderabad | Sakshi
Sakshi News home page

ది ఒడిస్సీకి మిస్‌... వారణాసికి ప్లస్‌?

Jul 20 2026 11:40 PM | Updated on Jul 21 2026 1:48 AM

Shortage of IMAX screens for  The Odyssey in Hyderabad

క్రిస్టోఫర్‌ నోలన్‌ రూపొందించిన దిఒడిస్సీ భారతదేశ వ్యాప్తంగా సంచలన కలెక్షన్లు సాధిస్తూ సాగిపోతోంది.  ఐమ్యాక్స్‌  ఫార్మాట్‌లో రూపొందిన చిత్రంగా దీన్ని పేర్కొంటున్నారు. ఈ సినిమాను ఐమ్యాక్స్‌ తెరపై చూడడం ఒక ప్రత్యేక అనుభవంగా ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే హైదరాబాద్‌ ప్రేక్షకులకు మాత్రం అది అందుబాటులో లేకపోవడం అత్యున్నత వీక్షణానుభవాన్ని ఆశించేవారిని నిరుత్సాహ పరుస్తోంది.

ఒకప్పుడు ఐమ్యాక్స్‌ తెరకు చిరునామాగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో ఆ తర్వాత ఆ అనుభవం తెరమరుగు కావడం తెలిసిందే. దాంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐమ్యాక్స్‌ స్క్రీన్‌ లోటు ఏర్పడింది. మరోవైపు ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో లాగా ది ఒడిస్సీ  పూర్తి  అనుభవాన్ని ఆస్వాదించే మిస్‌ అవుతున్నామని సినీ అభిమానులు అంటున్నారు.  

అల్లు సినిమాస్‌ తో ఊరట...
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభమైన అల్లు సినిమాస్‌  ది ఒడిస్సీ అభిమానులను ఆదుకుంటోంది.  మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక డాల్బీ అట్మాస్‌  సౌండ్‌ సిస్టమ్‌ ప్రేక్షకులకు అత్యున్నత శ్రవణ అనుభూతిని అందిస్తోంది. ఇప్పటిదాకా పలు చిత్రాలు ఈ థియేటర్‌లో ప్రదర్శితమైనప్పటికీ... ధియేటర్‌ ‘డాల్బీ’ సాంకే తిక సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో అనుభూతించడం ది ఒడిస్సీ ద్వారానే సాధ్యమైందని ప్రేక్షకులు అంటున్నారు.

ఈ సినిమాలోని సముద్ర అలల గర్జన, యుద్ధ సన్నివేశాల సందర్భంగా నేపథ్య సంగీతపు పూర్తి అనుభవాన్ని 3డీ  ఆడియో ద్వారా సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ముందునుంచే కాకుండా పక్కల నుంచి, వెనుక నుంచి, పై భాగం నుంచి కూడా ప్రవహించే శబ్ధ తరంగాల అనుభూతి ది ఒడిస్సీ ప్రేక్షకులకు వీనుల విందు చేస్తోంది. ఏది ఏమైనా గొప్ప గొప్ప చిత్రాలను ఆస్వాదించడానికి అదే స్థాయి సాంకేతిక సామర్ధ్యం కలిగిన థియేటర్లు కూడా తప్పనిసరి అని ది ఒడిస్సీ మరోసారి స్పష్టం చేస్తోంది.

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న దర్శక థీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుల వారణాసి కోసమైనా ఐమ్యాక్స్‌ను హైదరాబాద్‌లో కొలువుదీర్చాల్సిన అవసరం కనిపిస్తోంది. త్వరలోనే ఐమ్యాక్స్‌ తెరను హైదరాబాద్‌కు తెస్తామని ఇటీవల ఏషియన్‌ మూవీస్‌ ప్రకటించింది. ఆ ప్రకటన కార్యరూపం దాలిస్తే... ది ఒడిస్సీని మిస్సయినా, వచ్చే ఏడాది విడుదల కానున్న వారణాసిని అత్యద్భుతమైన దిగ్గజ తెరపై ఆస్వాదించే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement