
‘‘లిటిల్ హార్ట్స్’ చిత్రంలో కాత్యాయని అనే కాలేజ్ గర్ల్‌గా చేశాను. ప్రేక్షకులు తమని తాము పోల్చుకునేలా నా పాత్ర ఉంటుంది. ఈ సినిమాలోని అఖిల్ (మౌళి తనుజ్ పాత్ర), కాత్యాయని స్నేహం, ప్రేమ చూస్తుంటే కళాశాల రోజులు, అలాగే విద్యార్థిగా మనం చేసిన పనులన్నీ గుర్తొస్తాయి... మేమూ ఇలాగే ఉండేవాళ్లం అనిపిస్తుంది’’ అని శివానీ నాగారం తెలిపారు.
మౌళి తనుజ్, శివానీ నాగారం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమాని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శివానీ నాగారం మాట్లాడుతూ– ‘‘లిటిల్ హార్ట్స్’ సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమల్లి, నేను చిన్నప్పటి నుంచి స్నేహితులం. తన ద్వారా ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సాయి మార్తాండ్ కథ, నా పాత్ర చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది.
మా సినిమా కంటెంట్ నచ్చడంతో ‘బన్నీ’ వాసు, వంశీ నందిపాటిగార్లు రిలీజ్ చేస్తున్నారు. దాంతో మా సినిమా ఓవర్సీస్‌లోనూ విడుదలవుతోంది. ఇక థియేటర్, ఓటీటీ అనే తేడాలు చూడను. కథ, నా పాత్ర నచ్చితే వెబ్ సిరీస్‌లు కూడా చేస్తాను. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నేను, సుహాస్ కలిసి ‘హే భగవాన్’ సినిమా చేస్తున్నాం. మరో రెండు చిత్రాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.