
దర్శకుడు సుజీత్(Sujeeth), నిర్మాత దానయ్య కలిసి తెరకెక్కించిన చిత్రం ఓజీ (OG).. గత నెలలో విడుదలైన ఈ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న ఓటీటీలోకి కూడా రానుంది. ఈ సమయంలో దర్శకుడు సుజీత్ ఒక పోస్ట్ చేశారు. ఓజీ బడ్జెట్ విషయంలో దానయ్యతో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆయన ఇలా క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.
దర్శకుడు సుజీత్ చేసిన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు . 'ఓజీ మూవీ విషయంలో చాలామంది ఎన్నో విధాలుగా చర్చించుకున్నారు. అయితే, సినిమా మొదలైన సమయం నుంచి పూర్తి అయ్యే వరకు ఏం అవసరమనేది కొందరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. ఓజీ మూవీ విషయంలో నా నిర్మాత ఇచ్చిన మద్ధతు చాలా గొప్పది. మాటల్లో చెప్పలేను.' అని ఆయన అన్నారు.
ఓజీ సినిమా నిర్మాణ కోసం దర్శకుడు సుజీత్ చాలా ఎక్కువ ఖర్చు చేస్తున్నారని మొదటి నుంచే వార్తలు వచ్చాయి. మొదట అనుకున్న బడ్జెట్ కూడా దాటేసిందని ఇండస్ట్రీలో చెప్పుకొచ్చారు. అలా వారిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని ప్రచారం అయింది. రూ. 300 కోట్లు వచ్చాయని చెప్పుకుంటున్నా సరే ఈ మూవీ బడ్జెట్ భారీ స్థాయిలో పెరగడంతో నిర్మాతకు నష్టాలు తప్పలేదని చాలామంది ఆరోపించారు. దీంతో ఓజీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు దానయ్య నిర్మాతగా వ్యవహరించడం లేదనే టాక్ వైరల్ అయింది.
ఓజీ టైమ్లోనే హీరో నానితో సుజీత్ ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని కూడా డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపైనే రూపొందిస్తున్నట్టు ఆ సమయంలో తెలిపారు. అయితే, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఆ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో, దానయ్య- సుజీత్‌ల మధ్య వచ్చిన రూమర్స్కు మరింత బలాన్ని ఇచ్చాయి. అయితే, తాజాగా సుజీత్ చేసిన పోస్ట్తో ఈ గొడవలకు ఫుల్స్టాప్ పడినట్లు అయింది.
— Sujeeth (@Sujeethsign) October 21, 2025