
సహనమే శక్తి
‘‘దుర్గా మాతని శక్తి స్వరూపిణి అంటారు. ప్రతి స్త్రీలోనూ అంతర్లీనంగా దుర్గా మాత ఉంటుందని నేను నమ్ముతాను. అందుకే ఎలాంటి క్లిష్టమైన సవాల్‌ను ఎదుర్కొనాల్సి వచ్చినా బలంగా, ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతున్నారు... సక్సెస్ అవుతూ, వారిని వారు సంరక్షించుకోగలుగుతున్నారు. స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిచే దసరా మహిళలందరికీ పెద్ద పండగ’’ అని అన్నారు యువ నటి శివానీ నాగారం. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటిగా పరిచయం అయ్యారు శివానీ. ఇటీవల ‘లిటిల్ హార్ట్స్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తెలుగు తెరపై ఈ మధ్య మెరిసిన నవ తారల్లో తెలుగమ్మాయి శివానీకి అవకాశాలు మెండుగానే ఉన్నాయి. విజయోత్సాహంలో ఉన్న శివానీ దసరా, బతుకమ్మ పండగ విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.
మా కుటుంబానికి ‘దసరా’ చాలా పెద్ద పండగ. మేం అందరం కలిసి చాలా సందడిగా దసరా నవరాత్రులను చేసుకుంటాం. అలాగే బతుకమ్మ పండగను కూడా సెలబ్రేట్ చేస్తాం. రంగు రంగుల పువ్వులు సేకరించి, మా కుటుంబంలోని మహిళలతో పాటు అ పార్ట్‌మెంట్‌లోని మహిళలందరం కలిసి బతుకమ్మ ఆడతాం.
దసరా అనగానే నాకు అమ్మవారు గుర్తుకు వస్తారు. మనకు ఉన్న చెడు వెళ్లిపోయి మనల్ని అమ్మవారు గుడ్ డేస్, గుడ్ స్ట్రెంత్‌తో ఆశీర్వదిస్తారు. మేం ఆ రోజు బంగారం కొంటాం. తొమ్మిదో రోజు ఆయుధ పూజ చేస్తాం. మా ఇంట్లో ఉన్న కార్లు, బైక్‌లకు పూల మాల వేసి, పూజలు చేస్తాం. ఇంటిని బాగా అలకరించుకుంటాం. బూరెలు, పాయసం, పులిహోర... ఇలా రకరకాల వంటకాలు చేసి, దేవుడికి పూజ చేసి, నైవేద్యం పెడతాం. ఇక నా జీవితంలో దసరా పండక్కి ప్రత్యేకమైన మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. పెద్దవాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటాను. కొన్ని పండగలకు మా కజిన్స్ మా ఇంటికి వస్తారు. కొన్నిసార్లు మేం వాళ్ల ఇంటికి వెళ్తాం. అలా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటాం.
దసరా పండగకి సంబంధించి నా స్కూల్ డేస్‌లో కానీ, కాలేజ్ డేస్‌లో కానీ ఎలాంటి మైథలాజికల్ క్యారెక్టర్ చేయలేదు. అయితే అవకాశం వస్తే ఆ తరహా పాత్ర చేయాలని ఉంది. ఎందుకంటే ఆ పాత్రలో కొంత మహిళా సాధికారత ఉంటుందని నా నమ్మకం. ఓ నటిగా నాకు స్థిరత్వం, ఓపిక చాలా ముఖ్యం. దసరా అంటే క్లిష్టపరిస్థితులను దాటుకుని, విజయం సాధించడం. అందుకే మనకు ఓపిక, నమ్మకం ఉండాలి. చెడు రోజులను బలంగా ఎదుర్కొని, హుందాగా నెగ్గుకు రాగలగాలి.
చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలు
కోల్‌కతాలో దసరా నవరాత్రులను ఘనంగా జరుపుకుంటారు. నా జీవితంలో ఒక్కసారైనా నేను కోల్‌కతా వెళ్లి, దుర్గామాత పూజలో పాల్గొనాలని ఉంది. కొన్నిసార్లు నేను హైదరాబాద్‌లో బెంగాలీ సమితులకు వెళ్తాను. ప్రతి ఏడాది దసరా నవరాత్రుల ఉత్సవాల్లో ఏదో ఒకరోజు తప్పకుండా వెళ్లి, అమ్మ వారిని దర్శించుకుంటాను. అక్కడ దుర్గామాతకు హారతి ఇస్తారు. ఆ సమయంలో బెంగాలీ మహిళలు తెల్లచీర ధరించి, నుదుట ఎరుపు రంగు బొట్టు పెట్టుకుని, డ్యాన్స్ చేస్తుంటే ఆ వైబ్రేషన్సే వేరుగా ఉంటాయి. ఇక దసరా ఫెస్టివల్‌కి నా కాలేజీ డేస్ నుంచి దాండియా, గర్బా ఆడటం అలవాటు. ఎవరు దాండియా, గర్బా ఫెస్టివల్స్‌ను ఏర్పాటు చేసినా అక్కడికి మేం గ్రూప్‌గా వెళ్లి రాత్రంతా ఆడేవాళ్ళం. అంత క్రేజీగా ఉండేది. నాకు అది లవ్లీ ఎక్స్‌పీరియన్స్.
ఇదీ చదవండి: Janhvi Kapoor అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : అమేజింగ్ లుక్
నేను స్పిరిచ్యువల్ పర్సన్‌ని
బాధగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడనే కాదు... అవకాశం దొరికినప్పుడల్లా దేవాయాలకు వెళ్తుంటాను. గుడిని ఇల్లుగా భావిస్తాను. అలాగే ఇంటిని కూడా దేవాలయంలా అనుకుంటాను. మా కుటుంబ సభ్యులు కూడా అలానే ఉంటారు. నేను ఎక్కడకి వెళ్లినా, ఎక్కడున్నా దేవుడు అక్కడే ఉన్నారని నేను అనుకుంటాను. ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నన్ను రక్షిస్తుందని నా నమ్మకం. నన్నే కాదు... అందర్నీ రక్షిస్తుంటుందని భావిస్తాను. ఈ నమ్మకం వల్లే జీవితంలో ముందుకు వెళ్లగలుగుతాం.
ఉపవాసం అంటే స్వీయ నియంత్రణ
ఉపవాసం గురించి ఎవరి వ్యక్తిగత అభి్ర΄ాయాలు వారికి ఉండొచ్చు. దసరా సమయంలో ఇప్పటివరకు నేనైతే ఉపవాసం ఉండలేదు. మా అమ్మ, అమ్మమ్మగార్లు ఉంటారు. అయితే ఉపవాసం చేయడం వల్ల స్వీయ నియంత్రణ కలుగుతుంది. అమ్మవారికి మన వంతుగా ఏదో ఇచ్చిన ఓ సంతృప్తి ఉంటుంది.
ఓపికతో ఉండాలి
మనకు మనమే స్ఫూర్తిగా నిలవాలంటే ముందు మనపై మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇదే మనకు మనం ఇచ్చుకునే మోటివేషన్. ఎంత ఓపికతో ఉంటే అంత మంచి ఫలితం వస్తుందంటారు. సహనంగా ఉంటే ఏ పనైనా సరిగ్గా అవుతుంది. అందుకే నా ఓర్పే నా శక్తి అని నమ్ముతాను.
– ముసిమి శివాంజనేయులు