నన్ను చాలామంది కొట్టారు. కానీ, ఇంత గట్టిగా, కోపంగా కొట్టింది మాత్రం గుల్షన్ గ్రోవర్ (Gulshan Grover) ఒక్కడే అంటున్నాడు బాలీవుడ్ నటుడు సానంద్ వర్మ (Saanand Verma). 'ఫస్ట్ కాపీ' వెబ్ సిరీస్‌లో వీరిద్దరూ కలిసి నటించారు. ఓ సీన్ చిత్రీకరణలో భాగంగా గుల్షన్.. సానంద్ చెంప చెళ్లుమనిపించాలి. అయితే అతడు కొడుతున్నట్లుగా యాక్టింగ్ చేయకుండా నిజంగానే కొట్టానంటున్నాడు సానంద్.
నిజంగా చేయి చేసుకున్నాడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సానంద్ వర్మ మాట్లాడుతూ.. ఫస్ట్ కాపీ వెబ్ సిరీస్‌లో గుల్షన్ నన్ను కొట్టే సీన్ ఉంటుంది. అతడు నన్ను సీరియస్‌గానే కొట్టాడు. ఆ క్షణం నాకు అతడి పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది. కానీ, నన్ను నేను తమాయించుకుని సైలెంట్‌గా ఉన్నాను. ఇప్పటివరకు ఒక్కమాట కూడా అనలేదు. ఫస్ట్ టైం ఈ విషయాన్ని బయటపెడుతున్నాను.
ముందు చెప్పాలిగా!
నిజంగా కొట్టేముందు కనీసం ఓ మాటయినా నాకు చెప్పాలిగా! అప్పుడు నేను సిద్ధంగా ఉండేవాడిని. ఇంత ఫీలయ్యేవాడిని కాదు. అప్పటికీ ఆ సీన్ షూటింగ్ అయ్యాక నేను లోలోపలే బాధపడ్డాను తప్ప ఎవరితోనూ ఏమీ అనలేదు. దగ్గర్లో ఉన్న కుర్చీ అందుకుని కొట్టాలనిపించినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాను. ఒక నటుడిగా దెబ్బలు తినడం నాకు కొత్తేమీ కాదు.
నిజమైన దెబ్బలు కావు
ఎక్కువశాతం నాకు అలాంటి సీన్లే పడుతుంటాయి. 'బాబీ జీ ఘర్ పర్ హే' సీరియల్‌లో నేను చాలా చెంపదెబ్బలు తిన్నాను. కానీ, వాటికి ఓ పద్ధతి ఉంటుంది. అవేవీ నిజమైన దెబ్బలు కావు. మర్దానీ సినిమాలో కూడా నన్ను కొట్టే సీన్ ఉంటుంది. ఆ సన్నివేశం సరిగా రాకపోవడంతో నటుడు దిగ్విజయ్. నన్ను రియల్‌గా కొడతానని అడిగారు.
క్షమాపణలు కూడా చెప్పలేదు
నేను అంగీకారం తెలిపాకే నాపై చేయి చేసుకున్నాడు. ఇది ఒక పద్ధతి. నటుడు అనిల్ కపూర్ కూడా నిజంగానే కొడతారని విన్నాను. కానీ, ఆయన కొట్టిన వెంటనే క్షమాపణలు అడుగుతాడు. గుల్షన్ కనీసం ఆ పని కూడా చేయలేదు. తన లోకంలో తనే ఉంటాడు అని సానంద్ వర్మ చెప్పుకొచ్చాడు.
చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. నామినేషన్స్‌లో ఎవరంటే?


