
టాలీవుడ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల( Sreeleela) జోడీగా నటించిన చిత్రం 'రాబిన్‍హుడ్'(Robinhood).. ఉగాది కానుకగా మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. గతంలో భీష్మ సినిమాతో నితిన్ - వెంకీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాబిన్‌హుడ్ కూడా భారీగా క్లిక్ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.
రాబిన్‌హుడ్ చిత్ర మేకర్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్‌లో ఒక్కో టికెట్‍పై రూ.50 , మల్టీప్లెక్స్ లలో టికెట్‍కు రూ.75 ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.
రేట్లు పెంపు సరే.. తేడా వస్తే..
భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే గతంలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేవి. అయితే, ఇప్పుడు మీడియమ్ బడ్జెట్ చిత్రాలకు కూడా ఇలా రేట్లు పెంచడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో గేమ్ ఛేంజర్, డాకూమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలకు టికెట్ ధరలు పెంచారు. అయితే, ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడం బాగా తగ్గిపోయింది. దీంతో వెంటనే ఆ ధరలను మళ్లీ తగ్గించేశారు. ఇప్పుడు రాబిన్‍హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం సరైంది కాదని విమర్శలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే సరే.., ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం రిస్క్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెంపు వల్ల థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండకపోవచ్చని చెప్పవచ్చు.