
బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు మెల్లిగా సౌత్ ఇండియా పరిశ్రమైపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ నటీనటులు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. అయితే, 24ఏళ్ల క్రితమే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్( Raveena Tandon). మళ్లీ తమిళ సినిమాపై ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు. అంతేకాకుండా బెంగాలీ, కన్నడం, తెలుగు భాషల్లోనూ పలు చిత్రాల్లో కథానాయకిగా నటించారు. తమిళంలో అర్జున్‌కు జంటగా సాదు అనే చిత్రంతో 1994లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో కమలహాసన్‌కు జంటగా ఆళవందాన్ "అభయ్" చిత్రంలో నటించారు.
కాగా ఇటీవల కాలంలో కన్నడ హీరో యష్ కథానాయకుడిగా నటించిన సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. తెలుగులోనూ అడపా దడపా నటిస్తున్న రవీనా టాండన్ తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్ధమవుతున్నారు. నటుడు, సాంకేత దర్శకుడు విజయ్ ఆంటోని ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా లాయర్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జాషువా సేతురామన్ కథా,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా విజయ్ ఆంటోనీ తన విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కానుంది.

ఇందులో విజయ్ ఆంటోనికి దీటైన పాత్రలో ఒక ప్రముఖ నటి నటించబోతున్నట్లు దర్శకుడు ఇదివరకే చెప్పారు. కాగా ఆమె ఎవరని చిత్ర వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఆమే నటి రవీనా టాండన్. దీని గురించి దర్శకుడు తెలుపుతూ నటి రవీనా టాండన్ 1999లో నటించిన శూల్ చిత్రంలో ఆమె నటన తనకు ఎంతగానో నచ్చిందన్నారు. అలాంటి నటి తమ చిత్రానికి అవసరం అనిపించిందన్నారు. లాయర్ చిత్రంలో రవీనా టాండన్ పాత్ర నటుడు విజయ్ ఆంటోని పాత్రకు దీటుగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.