పోలీసులకు గన్‌ గురిపెట్టి అరెస్టైయిన పాప్‌ సింగర్‌

Punjabi Singer Shree Brar Arrested For Promoting Gun Culture In His Song - Sakshi

గన్‌లోడ్‌ చేసి పోలీస్‌కే గురిపెట్టిన కుర్రాడిని అమ్మాయిలు లైక్‌ చేస్తే చెయ్యొచ్చు. గవర్నమెంట్‌ మాత్రం డిస్‌లైక్‌ చేస్తుంది. అరెస్టు చేసి జైల్లో పెడుతుంది. పంజాబీ పాప్‌ సింగర్‌ శ్రీ బ్రార్‌ ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు. నెలక్రితం అతడు విడుదల చేసిన మ్యూజిక్‌ వీడియో ‘జాన్‌’.. గన్‌ కల్చర్‌ను ప్రేరేపిస్తుందన్న ఆరోపణపై పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఇప్పటివరకు కోటీ నలభై లక్షల మంది చూసిన ‘జాన్‌’లో అంతగా మందుగుండు సామగ్రి ఏముంది?!

ముంబై: పంజాబ్‌ సీఎం తన రాష్ట్రం మీద మాట పడనివ్వరు. తన రాష్ట్రాన్ని మాట అనిపించుకునేలానూ ఉండనివ్వరు. ఇప్పుడేమైందో చూడండి. పంజాబ్‌లో శ్రీ బ్రార్‌ అనే ర్యాప్‌ సింగర్‌ ఉన్నాడు. అతడు ‘జాన్‌’ అనే వీడియో సాంగ్‌ చేశాడు. పోలీస్‌ల పైనే గన్స్‌ ఎక్కుపెడతాడు బ్రార్‌ అందులో. యూత్‌ బాగా ఎట్రాక్ట్‌ అయింది ఆ సాంగ్‌కి! కోటీ నలభై లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఎట్రాక్ట్‌ అయితే అయ్యారు.. గన్‌ కల్చర్‌కి అడిక్ట్‌ అవుతారేమోనని పోలీసులు బ్రార్‌ను అరెస్టు చేశారు. ‘‘మంచి పని చేశారు. అరెస్ట్‌ చేయాల్సిందే అతడిని’ అని సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రకటించారు. ఇంత చిన్న విషయంలో సీఎం కల్పించుకోవడం పెద్ద విషయమే. ఆ వీడియోలోని తారాగణంలో, తాత్పర్యంలో ఉన్న ప్రభుత్వ ధిక్కార ధోరణులే అందుకు కారణం. 

‘జాన్‌’ నెల క్రితమే విడుదలైంది. శ్రీ బ్రార్‌ తోపాటు వీడియోలో బార్బీ మాన్‌ అనే లేడీ ర్యాపర్, గుర్నీత్‌ దొసాంజ్‌ అనే పాప్‌ ఆర్టిస్ట్‌ నటించారు. అందులోని మందు గుండు సాహిత్యం మాత్రం బ్రార్‌దే. ఈ వీడియో సాంగ్‌లో గుర్నీత్‌ రెండు చేతుల్తో రెండు గన్స్‌ పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌లోకి వెళ్తాడు. స్టేషన్‌లోని పోలీసుల్ని టపాటపామని లేపేసి, లాకప్‌ లాక్‌లను పేల్చేసి తన ‘అక్యూజ్డ్‌’ ఫ్రెండ్స్‌ని విడిపించుకుని వెళ్తాడు. ఈ హీరోయిజాన్నంతా బార్బీ ఆరాధన భావంతో చూస్తూ ఉంటుంది. ఈ దృశ్యాల వెనుక మన బ్రార్‌ రాసిన సాంVŠ  రన్‌ అవుతుంటుంది. ‘నో డౌట్‌.. నో డౌట్‌ నీకు మీసాలొచ్చాయ్‌. నీ పొలంలో కొత్త ట్రాక్టర్‌ గర్జిస్తోంది. ఓ జాట్‌ కుర్రాడా.. నీకు నువ్వే ఒక బ్రాండ్‌. నేరాన్ని శ్వాసించే వాళ్లంతా నీ వైపే. అందుకే వాళ్లను విడిపించేందుకు వెళ్తున్నావ్‌. పోలీసులకు నువ్వేమిటో చూపించు..’ అని పంజాబీలో బార్బీ మాన్‌ పాడుతుంటుంది. ఈ సాంగ్‌.. గన్‌ కల్చర్‌ని ప్రోత్సహించేలా ఉందని శ్రీ బ్రార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడిపై కేసు పెట్టింది పటియాలా సీనియర్‌ సూపరింటెండెంట్‌ విక్రమ్‌ జీత్‌ దుగ్గల్‌. హింసను ప్రేరేపించడం, సంఘ విద్రోహశక్తులను పురికొల్పడం, గ్యాంగ్‌స్టర్‌లకు ఆశ్రయం ఇమ్మని వీడియోలో ఇన్‌డైరెక్టుగా చెప్పడం.. బ్రార్‌పై ప్రధాన ఆరోపణలు. 

‘ప్రిన్స్‌ ఆఫ్‌ పటియాలా’ గా 2016లో పాప్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు బ్రార్‌. చండీగఢ్‌ కుర్రాడు. కాలేజ్‌లో ఆర్ట్స్‌ స్టూడెంట్‌. కరన్‌ అవుజ్లా, దిల్‌ప్రీత్‌ థిల్లాన్‌తో కలిసి పాడిన పంజాబీ సాంగ్‌ ‘యార్‌ గ్రరీబాజ్‌’తో ఇతడొకడున్నాడని ఇండీపాప్‌ సీనియర్‌ ఆర్టిస్టుల దృష్టిలో పడ్డాడు. పెద్దగా ఆల్బమ్‌లు లేకపోయినా, వచ్చిన  కొత్తల్లో చేసిన అరకొర సాంగ్స్‌.. ఇప్పుడతడిపై వచ్చిన ఆరోపణల్ని పోగొట్టి.. ‘కుర్రాడు మంచివాడే’ అనే ఆలోచన కలిగించేంత బలమైనవి కావు. బ్రార్‌ ఎన్నో రోజులు జైల్లో ఉండకపోవచ్చు. సీఎం అమరీందర్‌ సింగ్‌ శిక్షకు బెదరేలా చేస్తారు కానీ, శిక్ష విధించరని అంటారు.
ఇక ‘జాన్‌’లోని బార్బీ మాన్‌కి బ్రార్‌ని మించిన ప్రొఫైలే ఉంది. ఫిరోజ్‌ పూర్‌ అమ్మాయి. పంజాబీ, భాంగ్రా, పాప్‌లో యువతను ఆకట్టుకునే స్వరాభినయం బార్బీది. 2020 జూన్‌లో రిలీజ్‌ అయిన బార్బీ సింగిల్‌ ‘తెరీ గలీ’ని ఒక్క నెలలో 2 కోట్ల 90 లక్షల మంది యూట్యూబ్‌ వ్యూయర్స్‌ చూశారు. ‘మేరీ సహేలీ’ ట్రాక్‌తో రెండేళ్ల క్రితం మొదలైన బార్బీ కెరీర్‌ ఇప్పుడు పీక్‌లో ఉంది. బీబీసీ చార్ట్‌లో ఆమె పేరు ఉంది. ఇప్పుడీ ‘జాన్‌’తోనూ ఆమెకు పేరు వచ్చిందే తప్ప, బ్రార్‌ సాహిత్యానికి గాత్రమిచ్చినందుకు పంజాబ్‌ ప్రభుత్వం ఏమీ అనలేదు.            

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top