ఆడిషన్స్‌లోనే అవమానం.. ఇప్పుడు ఆమెనే స్టార్ హీరోయిన్! | Sakshi
Sakshi News home page

Nayanthara: నటించడం రాదని రిజెక్ట్ చేశారు.. కట్‌ చేస్తే సూపర్‌స్టార్!

Published Mon, Nov 20 2023 12:52 PM

Nayanthara Gets Rejections In Auditions In Her Cinema Career - Sakshi

పుట్టుకతోనే అందరూ ప్రతిభావంతులు కారు. పుత్తడి అయినా సాన పెడితేనే మెరుస్తుంది. ఒకసారి కాకపోయినా మరోసారి ప్రతిభ వెలికి వస్తుంది. ప్రస్తుతం లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నటి నయనతార జీవితం కూడా అలాంటిదే. ఈ కేరళ భామ కోలీవుడ్‌లో ఎంటర్‌ అవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలా పలు అవమానాలను, ఆవేదనలను భరించారు. అయ్యా చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి దిగుమతి అయ్యారు. అయితే అంతకు ముందే అవకాశాలు ఈమెను ఊరించి ఉసూరుమనిపించాయి.

అయితే నటుడు, దర్శకుడు పార్తీపన్‌ నయనతారకు తొలి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన చెప్పిన సమయానికి నయనతార అడిషన్‌కు హాజరు కాలేకపోయారు. అప్పటి ఆమె పరిస్థితి అలాంటిది. కేరళ నుంచి చైన్నెకు బస్సులో చేరుకునే ప్రయత్నంలో ఆమెకు ఆలస్యమైంది. కారణం పార్తీపన్‌కు ఫోన్‌ ద్వారా వివరించినా.. ఆయన కోపంతో నువ్వు ఇక రావలసిన అవసరం లేదని చెప్పడం నయనతారకు కలిగిన తొలి నిరాశ. 

ఆ తరువాత శింబుకు జంటగా తొట్టి జయ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు వీజెడ్‌ దురై అడిషన్‌ నిర్వహించారు. అందులో పాల్గొన్న నయనతార సరిగా నటించకపోవడంతో నీకు నటన సెట్‌ కాదు వెళ్లిపోవచ్చు అంటూ రిజెక్ట్‌ చేశారు. ఇది నయనతార ఎదుర్కొన్న మరో అవమానం. అలాంటిది అయ్యా చిత్రంలో శరత్‌కుమార్ సరసన‌ నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో నయనతారకు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. 

ఆ తరువాత కూడా పలు సందర్భాల్లో పలు సంఘటనలు కారణంగా ఆవేదనకు గురయ్యారు. సవాళ్లను ఎదురొడ్డి, ప్రేమ వైఫల్యాలను తట్టుకుని నిలిచారు. అలాంటిది రజనీకాంత్‌, శరత్‌కుమార్‌, విజయ్‌, అజిత్‌, శింబు, ధనుష్‌ అంటూ తమిళంలోనూ తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌తోనూ, హిందీలో బాద్‌షా షారూక్‌ఖాన్‌ వంటి సూపర్‌స్టార్‌లతో నటించి లేడీ సూపర్‌ స్టార్‌ అయ్యారు. కాగా.. నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టిన రోజు తన పిల్లలతో కలిసి జరుపుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement