Newsense: న్యూసెన్స్‌ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. ఎలా ఉందంటే?

Navdeep, Bindhu Madhavi Starrer Newsense Web Series Review, Rating In Telugu - Sakshi

వెబ్‌ సిరీస్‌: న్యూసెన్స్‌
నటీనటులు: నవదీప్‌, బిందుమాధవి, మహిమా శ్రీనివాస్‌, నంద గోపాల్‌, చరణ్‌ కురుగొండ, జ్ఞానేశ్వర్‌
దర్శకుడు: శ్రీ ప్రవీణ్‌ కుమార్‌
నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌
నిర్మాణ సంస్థ: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: సురేశ్‌ బొబ్బిలి
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఆహా
రిలీజ్‌ డేట్‌: మే 12, 2023

మీడియా.. మూడు అక్షరాల పదం. బలవంతుడికి, బలహీనుడికి కావాల్సిన ఆయుధం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి. పక్కన ఉన్న స్నేహితుడిని నమ్మకపోయినా సరే పొద్దున్నే పేపర్‌లో వచ్చే వార్తను మాత్రం నమ్ముతారు. అంతటి పవర్‌ పెన్నుకు ఉంది. ఆ కలం కల్పితాలను సృష్టిస్తే, నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తే, పైసా ఉన్నోడికి లొంగిపోయి తప్పులను కప్పిపుచ్చేస్తే.. మీరే దిక్కంటూ మీడియానే నమ్ముకున్న అనామకులను సైతం నయవంచన చేస్తే..  నిజం చాటున నిలబడాల్సిన వాళ్లు ఎందుకలా తయారయ్యారు? వంటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించిన సిరీస్‌ న్యూసెన్స్‌.

కథ: 
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ప్రెస్‌క్లబ్‌ చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ ఏది రాస్తే అదే నిజం అని జనాలు గుడ్డిగా నమ్ముతుంటారు. సమస్య ఎక్కడుంటే  అక్కడ పోలీసుల కన్నా ముందే వాలిపోతారు పాత్రికేయులు. నిజానిజాలు తెలిసినా బలం, బలగం, డబ్బు ఉన్నవాళ్లకు అమ్ముడుపోయి అబద్ధాన్నే ప్రచారం చేస్తారు. వీళ్లకు కావాల్సిందల్లా సాయంత్రానికి పైసల కవర్‌ వచ్చిందా? లేదా! ఇదే వీళ్లు నేర్చుకున్న, అలవాటు పడిన జర్నలిజం.

ఈ ప్రెస్‌క్లబ్‌లో శివ(నవదీప్‌) ఓ న్యూస్‌ ఛానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే లోకల్‌ న్యూస్‌ ఛానల్‌లో నీల (బిందు మాధవి) న్యూస్‌ రీడర్‌గా పని చేస్తుంది. వీరిద్దరి మధ్య చిన్న లవ్‌ ట్రాక్‌ ఉంటుంది. ఇకపోతే పోలీసులకు, ప్రభుత్వాధికారులకు చెప్పినా పట్టించుకోని సమస్యను పాత్రికేయులకు చెప్తే న్యాయం దొరుకుతుందని భావిస్తూ ప్రెస్‌క్లబ్‌ మెట్లెక్కుతారు అమాయక జనాలు. కానీ వారికి అండగా ఉండాల్సింది పోయి బాధలు పెడుతున్న రాబంధులకే సలాం కొడతారు. న్యాయం దొరక్క అమాయకులు ప్రాణాలు పోతున్నా వారి మనసు కరగకపోవడం గమనార్హం.

అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య జర్నలిస్టులు నలిగిపోయే తీరు, ఎవరికి వత్తాసు పలకాలో తెలియని డైలమా, ఇద్దరి దగ్గరా డబ్బులు తీసుకుని సమన్యాయం చేసే నక్క తెలివితేటలు.. ఇలా చాలానే ఉన్నాయి. మధ్యలో హీరో.. పవర్‌ ఉన్నోడిని ఎదిరించలేక, అరిగోసలు పడ్తున్న అమాయకులకు అండగా ఉండలేక నలిగిపోతుంటాడు. చివర్లో వచ్చిన కొత్త పోలీసాఫీసర్‌ రాజకీయ నాయకులకు, ప్రెస్‌ వాళ్లకు చుక్కలు చూపిస్తాడు. మరి ప్రజల సమస్యలకు చెక్‌ పడిందా? పోలీసాఫీసర్‌కు, శివకు మధ్య వైరం ఏంటి? రిపోర్టర్స్‌ను రాజకీయ నాయకులు ఎలా వాడుకున్నారు? వంటి విషయాలు తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే!

విశ్లేషణ
మీడియాపై సినిమాలు రావడం చాలా అరుదు. డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈ పాయింట్‌ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. అయినప్పటికీ కథను తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. న్యూసెన్స్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలు చొప్పించి సాగదీసినట్లుగా అనిపిస్తుంది.  రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మంచి చేయలేని నిస్సహాయుడిగా హీరోను చూపించారు. దీనివల్ల నిరంతరం అతడు సంఘర్షణకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. లోపల మంచితనం ఉన్నా దానికి ముసుగు వేస్తూ బతకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. చివర్లో అయినా హీరో మారి అన్యాయాన్ని ఎదిరిస్తాడనుకుంటే నిరాశే ఎదురవుతుంది. బహుశా రెండో సీజన్‌లో అతడి మార్పును చూపిస్తారేమో! మధ్యలో మదర్‌ సెంటిమెంట్‌ను కూడా వాడారు.

ఈ సీన్‌ మాత్రం హైలైట్‌
ఓ పేద రైతు కష్టపడి సాగు చేస్తున్న భూమిని ఓ రాజకీయ నాయకుడి మనుషులు కబ్జా చేస్తారు. ఎక్కడా న్యాయం దొరక్క జరల్నిస్టుల దగ్గరకు వస్తారు. వాళ్లు అతడికి సాయం చేస్తామని మాయమాటలు చెప్పి రైతును అడ్డుపెట్టుకుని వారి సొంత పనులు చేసుకుంటారు. నిజం తెలిసిన రైతు చివరకు తెగించి తనే భూమిని కాపాడుకోవాలని పొలానికి వెళ్తాడు. అక్కడున్న రౌడీలు అతడిని అదే భూమిలో చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు రాయిస్తారు. ఈ సీన్‌ వల్ల జర్నలిస్టులు ఇంత రాక్షసంగా ఉంటారా అనిపిస్తుంది. మరో సంఘటనలో ఓ మహిళ భర్తను పొలిటీషియనే హత్య చేయిస్తాడు. కానీ ఆమె అక్రమ సంబంధం వల్లే అతడు చనిపోయాడంటూ వార్త రాస్తారు. ఈ సీన్‌లో పాత్రికేయులు మరీ ఇంత నీచానికి దిగజారతారా? అనిపించక మానదు.

న్యూస్‌ రాస్తే రూ.200, రాయకుంటే రెండు వేలు అన్న డైలాగ్‌ నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. బలవంతుడికి చేతులెక్కి మొక్కాలే కానీ రాళ్లు విసరకూడదు అన్న మాట నాయకులకు వ్యతిరేకంగా ఏమీ చేయలేమన్న చేతకానితనాన్ని చూపిస్తుంది. న్యూస్‌ రాసేవాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది అన్న డైలాగ్‌ ముమ్మాటికీ నిజం. సిరీస్‌ అంతా ఓకే కానీ క్లైమాక్స్‌ మాత్రం అస్సలు రుచించదు. రెండో సీజన్‌ ఉంటుందని హైప్‌ క్రియేట్‌ చేయాలనుకున్నారు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ క్లైమాక్స్‌ ఓ అర్థంపర్థం లేకుండా గాలికొదిలేనిట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ను సగంలోనే వదిలేసినట్లుగా ఉంటుంది.

ఎలా నటించారంటే?
నవదీప్‌ ఆకలి మీదున్న సింహంలా కనిపించాడు. చిత్తూరు యాసలో డైలాగ్స్‌ అదరగొట్టేశాడు. నిజానికి, అబద్ధానికి మధ్య నలిగిపోయే సన్నివేశాల్లో బాగా నటించాడు. బిందుమాధవి హీరో ప్రేయసి పాత్రగా అందంతో ఆకట్టుకుంది. అయితే ఈ సిరీస్‌లో నటనపరంగా తనకు పెద్దగా స్కోప్‌ లభించలేదు. తిక్కలోడిగా కనిపించే పోలీసాఫీసర్‌ ఎడ్విన్‌ పాత్రలో నందగోపాల్‌ నటనకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఆయన క్యారెక్టర్‌ ఎంట్రీ ఇచ్చాకే సిరీస్‌కు ఓ ఎనర్జీ వచ్చింది. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. సురేశ్‌ బెబ్బులి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ బాగా ప్లస్‌ అయింది. అనంతనాగ్‌ కావూరి, ప్రసన్న, వేదరామన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది.

సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే.. న్యూసెన్స్‌ను న్యూస్‌గా రాస్తారు, కానీ ఇక్కడ న్యూసే న్యూసెన్స్‌ అయింది!

Rating:  
(2.75/5)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top