బోగస్‌ ఓట్లున్నాయి... ‘మా’ ఎన్నికలు ఆపండి: జూనియర్‌ ఆర్టిస్ట్‌ సంఘం

Junior Artist Police Complaints On MAA Elections 2021 - Sakshi

బంజారాహిల్స్‌: ఓటరు జాబితాలో ఉన్న బోగస్‌ ఓటర్లను తొలగించిన తర్వాతే ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని జూనియర్‌ ఆర్టిస్ట్‌ సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. అక్టోబర్‌ 10న (ఆదివారం) జరిగే ఎన్నికల్లో 3,609 మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఓటు హక్కు కలిగి ఉన్నారని, అయితే ఓటరు జాబితాలోని పేర్లున్న వారికి ఫోన్లు చేస్తే చాలా మంది తాము యూనియన్‌ సభ్యులం కాదని చెబుతున్నారని, ఇంకొందరు సమాధానం చెప్పడానికి నిరాకరిస్తున్నారని జూనియర్‌ ఆర్టిస్ట్‌ సంఘం నేతలు రవీందర్‌ సంకూరి, రమావేణి, అశోక్‌ బెజవాడ తదితరులు శుక్రవారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బైలాస్‌కు విరుద్ధంగా పని చేస్తున్న వల్లభనేని అనిల్‌కుమార్, స్వామిగౌడ్, సినీ పరిశ్రమకు సంబంధం లేని శేషగిరిరావు నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఓటరు లిస్ట్‌ను సరి చేసి ఎన్నికలు నిర్వహించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత సెప్టెంబర్‌ నెలలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ సర్వసభ్య సమావేశం జరిగిందని అక్టోబర్‌ 10న ఎన్నికలు జరుపుతున్నట్లు ఆరోజు ప్రకటించలేదని ఎజెండా లేకుండానే కేవలం నాలుగు రోజుల ముందు నోటీస్‌ బోర్డుపై వివరాలు ఉంచారని దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌కే.మల్లిక అనే జూనియర్‌ ఆరిస్ట్, జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యూనియన్‌లో రికార్డులు అడిగితే ఇవ్వడం లేదని వాటిని ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ నుంచి 1,600 కార్డులలో 720 కార్డుల సభ్యుల నుంచి ఒక్కొక్కరికి రూ. 25 వేలు కార్డు రెన్యువల్‌ పేరుతో సుమారు రూ.1.80 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారని బైలాస్‌కు విరుద్ధంగా ఎలా వసూలు చేశారని ఫిర్యాదులో ప్రశ్నించారు. ఓటరు జాబితా, లెడ్జర్లు, రిసిప్ట్‌ బుక్‌లు, మినిట్స్‌ బుక్‌లు, నెలవారీ ఆదాయ వ్యవహారాలు, అసోసియేట్‌ కార్డు మెంబర్లు, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు, ఆడిటింగ్‌ వివరాలు ఇవన్నీ తనిఖీ చేసుకునే అవకాశం జూనియర్‌ ఆర్టిస్ట్‌లకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top