బుల్లితెర జంట జై భానుషాలి - మహి విజ్ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 15 ఏళ్ల అన్యోన్య దాంపత్యానికి ఫుల్‌స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని జై భానుషాలి, మహి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈరోజు మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఎవరి జీవితాలు వారివి. అయినప్పటికీ ఒకరికొకరం సపోర్ట్‌గా ఉంటాం.
దారులు వేరు
మా పిల్లలు తార, ఖుషి, రాజ్‌వీర్‌లకు తల్లిదండ్రులుగా, బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతాం. వారికోసం ఏదైనా చేస్తాం. మా దారులు వేరయ్యాయి. కానీ, మా కథలో విలన్ అంటూ ఎవరూ లేరు. దయచేసి మా నిర్ణయాన్ని తప్పుపట్టకండి. మేము డ్రామాలు చేయడానికి బదులుగా శాంతియుతంగా ఉండటానికే సిద్ధమయ్యాం. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నోట్ షేర్ చేశారు.

ప్రేమకథ
జై- మహి ఓ క్లబ్‌లో తొలిసారి కలిశారు. పరిచయమైన మూడు నెలల్లోనే మహి తనకు కరెక్ట్ పార్ట్‌నర్ అనిపించింది జైకి. ఇద్దరి మనసులు కలవడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరు తమ దగ్గర పనిచేసేవారికి జన్మించిన పిల్లలు రాజ్‌వీర్, ఖుషిల బాధ్యతను భుజానేసుకున్నారు. ఆ ఇద్దరు పిల్లలను పెంచుతున్నారు. జై దంపతులకు 2019లో ఐవీఎఫ్ ద్వారా కూతురు తారా జన్మించింది. ఇకపోతే 2025లోనే బుల్లితెర జంట విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని మహి వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు అదే నిజమని రుజువు చేస్తూ వీరు విడిపోయారు.
తెలుగు సినిమా హీరోయిన్
మహి.. 2004లో వచ్చిన తెలుగు మూవీ తపనలో హీరోయిన్‌గా కనిపించింది. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసింది. తర్వాత సీరియల్స్‌కు షిఫ్ట్ అయింది. జై భానుషాలి.. హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా వంటి సినిమాల్లో యాక్ట్ చేశాడు. అలాగే పలు సీరియల్స్‌లోనూ తళుక్కుమని మెరిశాడు. జై- మహి జంటగా నాచ్ బలియే అనే డ్యాన్స్ షో సీజన్ 5లో పాల్గొని ట్రోఫీ గెలిచారు.


