Intinti Gruhalakshmi: తులసిలో మార్పు, షాక్‌లో శృతి

Intinti Gruhalakshmi May 26: Tulasi Fires On Anasuya - Sakshi

కట్టుకున్న భర్త తన చెంతకు వస్తాడన్న తులసి కల కలగానే మిగిలిపోయింది. మధ్యలో వచ్చిన లాస్య.. తన జిత్తులమారి ప్లాన్‌లతో నందును ఎగరేసుకుపోయింది. తులసి పేరు చెప్తేనే పూనకం వచ్చేలా నందును తన వైపు తిప్పుకుంది. లాస్యను ఇంటి నుంచి పంపించాలనుకుంటే ఆమె కొంగు పట్టుకుని భర్త కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో అయోమయంలో పడిపోయింది తులసి. కానీ ఇప్పుడిప్పుడే ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యంతో ఎదురు చెప్పడం ప్రారంభించిన తులసి తిరిగి ఉద్యోగంలో చేరబోతోంది. మరి నేటి (మే 26) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే ఇది చదివేయండి..


"నేను అన్నం తినకపోతే అమ్మ అల్లాడిపోయేది, నాకు దెబ్బ తగిలితే అమ్మకు కన్నీళ్లొచ్చేవి.. అప్పుడు అమ్మ ఇంత ఓవరాక్షన్‌ చేస్తుందేంటి అనుకున్నా.. కానీ ఇప్పుడర్థమవుతోంది అదే అసలైన ప్రేమ అని, అది నాకు కావాలనిపిస్తోంది.." అంటూ అభి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రారమ్మని అమ్మ ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోలేదని పశ్చాత్తాపపడ్డాడు. ఓ వైపు కడుపులో ఆకలి మెలివేస్తుంటే కన్నీళ్లు దిగమింగుకుంటూ మంచినీళ్లతో సరిపెట్టుకున్నాడు.


తన దగ్గర మొసలి కన్నీళ్లు కారుద్దామనుకున్న భాగ్య నోరు మూసుకునేలా చేసింది తులసి. తనను చూస్తే చాలా బాధగా ఉందన్న భాగ్య మాటలకు మధ్యలోనే అడ్డుపడింది. ఎవరెలాంటివారో తనకు తెలుసని, జరుగుతున్నదానికి ఎక్కువ సంతోషపడుతున్నట్లున్నావ్‌ అని చెప్పడంతో భాగ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లైంది. అనంతరం తన మామయ్య దగ్గరికి వెళ్లిన తులసి ఇంటిని నడపాలంటే తను ఉద్యోగం చేయాలని అందుకోసం ఆయన అనుమతి తీసుకుంది. ఆర్థికంగా బలపడితేనే అనుకున్నవి చేయగలవని, కాబట్టి నిశ్చింతగా జాబ్‌ చేయమంటూ ధైర్యం నూరిపోశాడు. నా కొడుకు నీ ప్రేమను ఎలాగో గుర్తించలేకపోయాడు, కానీ ఇప్పుడు నీ గెలుపుతో అతడిని నీవైపు తిప్పుకో అని సూచించాడు.

ఇక శృతి తిరిగి ఇంట్లోకి రావడంతో నందు తల్లి నిప్పులు చెరిగింది. అయినవాళ్లను ఆమడ దూరంలో కూర్చోబెట్టడం, కానివాళ్లను కుర్చీలో కూర్చోబెట్టడం మీకు అలవాటే కదూ అంటూ నిప్పులు చెరిగింది. అయితే ఆమె నోటికి అడ్డుకట్ట వేస్తూ.. శృతి తన మనిషి అని, ఆమెను ఏమన్నా ఊరుకునేది లేదని లాస్య అత్తకు వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆమెను కిమ్మనకుండా ఉండిపోయింది. ఆమెలో వచ్చిన మార్పు చూసి శృతి ఒక్కసారిగా షాకైంది.

మరోవైపు నందు, లాస్య తులసి ఇంటెదురుగా ఓ కొత్తిల్లు అద్దెకు తీసుకుని దిగారు. ఇక ఇప్పటి నుంచి తులసికి అందరినీ దూరం చేస్తూ చివరకు ఏకాకిగా మార్చుతానని లాస్య గట్టి ప్లాన్‌లో ఉంది. మరోవైపు తన కొడుకు అభితో పాటు, భర్త నందును ఎలాగైనా ఇంటికి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉంది తులసి. మరి వీరిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు? ఎవరు ఏకాకిగా మారుతారు? అన్నది అ‍త్యంత ఆసక్తికరంగా మారింది.

చదవండి: RRR Movie: ఫైట్‌ సీన్‌కి కన్నీళ్లొస్తాయి! 

మహేష్‌బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top