వైరుధ్యం వైవిధ్యాల  విలక్షణ గాయని జానకి | Indian playback singer and music composer S Janaki Special Story | Sakshi
Sakshi News home page

వైరుధ్యం వైవిధ్యాల  విలక్షణ గాయని జానకి

Apr 23 2026 6:12 AM | Updated on Apr 23 2026 6:12 AM

Indian playback singer and music composer S Janaki Special Story

ఏప్రిల్‌ 23 ఎస్‌. జానకి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక వ్యాసం

నదులెన్నో ఉంటాయి... నదులలో గంగానది ప్రత్యేకతే వేరు... కారణం ఆ నది అనేక స్థలాలను స్పృశిస్తూ వాటిని క్షేత్రాలుగా మార్చటమే కాకుండా తన పేరును కూడా మార్చుకుంటుంది... అలాగే నేపథ్య గాయనీమణులెందరో ఉన్నా ఎస్‌. జానకి ప్రత్యేకతే వేరు. ఎందరో సంగీత దర్శకుల పాటలకు తన గాత్రంతో న్యాయం చేసి, వారి పేరు నిలబెట్టారు జానకమ్మ.

గళంలో మాధుర్యం, స్థాయితో పాటు అనుకరణ కళ జానకమ్మ  ప్రత్యేకత. తన గాత్రం ద్వారా ఆమె ఆరేళ్ల పాప మొదలు అరవై ఏళ్ల అమ్మమ్మ వరకు ఆయా పాత్రలను ఆవిష్కరించారు. అటు శాస్త్రీయ సంగీతాన్ని, ఇటు జానపద సంగీతాన్ని అలవోకగా ఆలపించారు. నవరసాలను పలికించే అద్వితీయ స్వరం కలిగిన అపర గాన సరస్వతి. భక్తి, రక్తి, ముక్తి, శక్తి... ఇలా ఏ పాటకైనా న్యాయం చేసే ఏకైక గాయని. ఏ శ్రుతిలోనైనా పాడగలిగే విలక్షణ ప్రతిభామణి... ఇంత వైరుధ్యం, వైవిధ్యం కలిగి ఉండటం అరుదాతి అరుదు. ముఖ్యంగా చెప్పాలంటే స్వరానుకరణలో ఆమెకు ఆమే సాటి... ఆమెకు లేరు పోటీ.

నీ లీల పాడెద దేవా...: జానకమ్మ టాలెంట్‌ తొలిసారి ‘మురిపించే మువ్వలు’ (1962) చిత్రం ద్వారా బయటపడింది. ఈ సంగీత నృత్య చిత్రానికి ఎస్‌.ఎం. సుబ్బయ్య నాయుడు సంగీతం అందించారు. సన్నివేశం ప్రకారం ఇది నాద స్వరంతో పోటీ పడుతూ సాగే శాస్త్రీయ సంగీతంలో పాడాల్సిన పాట. ఈ పాట బాణీని విన్న తర్వాత లీల తాను అంత హై పిచ్‌లో పాడలేనని చెప్పి జానకమ్మ పేరును సూచించారు. ఆ విధంగా జానకి తొలుత తమిళంలో ‘సింగార వేలనే దేవా’ అని పాడి తెలుగులో ఆరుద్ర రాసిన ‘నీ లీల పాడెదా దేవా...’ పాటను అవలీలగా పాడారు. 

ఇందులో ఆమె నాద స్వరంతో పోటీగా స్వర కల్పన చేయడం న భూతో న భవి ష్యతి. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు కారుకురిచ్చి అరుణాచలం నాద స్వరం వాయించగా, జానకి నాద స్వరం శ్రుతిలోనే ఆలపించడం విశేషం. కారణం నాద స్వరం ‘హై పిచ్‌’లో ఉంటుంది. ఇలా నాద స్వరంతో పోటీ పడుతూ ‘సన్నాయి అప్పన్న’ (1980) చిత్రంలోనూ జీకే వెంకటేశ్‌ సంగీతంలో ‘కదిలించు నీ కలికి హృదయం’ పాటను మన హృదయాలు కరిగించేలా పాడారు జానకమ్మ. ఈ పాటకు ప్రముఖ సంగీత విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్‌ హిందుస్థానీ సంగీతంలో ప్రముఖ వాద్యమైన షెహనాయ్‌ను వాయించడం విశేషం. షెహనాయ్, నాద స్వరాలతో పాటు వేణువుతో పోటీపడుతూ ‘సప్త పది’ (1981)లో ‘నెమలికి నేర్పిన నడకలివే’ పాటను అదే శ్రుతిలో పాడి అలరించారు జానకమ్మ. 

సిరిమల్లె పువ్వల్లె నవ్వు...: మామూలుగా సాహిత్యం లేకుండా కేవలం లయ బద్ధంగా నవ్వుతూ పాటను రక్తికట్టించడం ఆషామాషీ కాదు. కానీ జానకమ్మ ‘జ్యోతి’ (1976) చిత్రంలో తాళం ప్రకారం నవ్వి అందరినీ నివ్వెరపరచారు. చక్రవర్తి సంగీతంలో బాలుతో కలిసి పాడిన ‘సిరిమల్లె పువ్వల్లె నవ్వు... చిన్నారి పాపల్లే నవ్వు...’ పాటలో ఆమె ఆద్యంతం నవ్వుతో తన భావాలను వ్యక్తీకరించడం విశేషం. ఇందులో బాలు స్వరాలు పాడితే జానకమ్మ దానికి అవే స్వరాలను నవ్వుతో పలికించడం విశేషం.

చలికి వణికినట్లుగా...: ‘శంకరాభరణం’ చిత్రంలో శంకరశాస్త్రి తన పదేళ్ళ కూతురు శారదను తెల్లవారు ఝామునే ఒక నదీ తీరంలో కంఠం లోతు వరకు కూచోబెట్టి సంగీత పాఠాలు బోధిస్తుంటాడు. ఈ సన్నివేశంలో జానకమ్మ బాలిక స్వరానికి తగ్గట్టు మాత్రమే కాకుండా అపస్వరం లేకుండా శ్రుతిలో పాడటం విశేషం. అలాగే  ఒక చోట వేగంగా ఆలపించే స్వరాలను కూడా శిష్యురాలిలా తడబడుతూ పాడటం విశేషం. 

ఇదే చిత్రంలో పెళ్లి చూపుల సందర్భంలో శారద హిందోళ రాగంలో ‘సామజ వర గమనా’ అనే త్యాగరాజ కీర్తన పాడుతూ, అబ్బాయిని చూస్తూ ప్రేమ పారవశ్యంలో ఏకాగ్రత కోల్పోయి నిషిద్ధ స్వరాలైన రిషభ స్వరాన్ని స్పృశిస్తుంది. దాంతో శంకర శాస్త్రి... శుద్ద హిందోళం రాగంలో రిషభం ఎలా వచ్చింది? అని ఆగ్రహిస్తాడు. ఈ పాట శాస్త్రీయంగా మొదలై, మధ్యలో చరణాలలో నాయికా నాయకుల ప్రణయంతో విహరించి, పాట చివర ఆలాపనలో అన్య స్వర ప్రయోగంతో తప్పు పాడి, సంబంధమే కాదనుకొనే ప్రళయానికి దారి తీస్తుంది. 

బాలుర గొంతులను అనుకరిస్తూ...: ‘సప్తపది’లో ‘గోవుల్లు తెల్లన... గోధూళి తెల్లన... గోపయ్య నల్లన?’ అనే వర్ణ వివక్షతను ప్రశ్నిస్తూ రాసిన గీతాన్ని బాలుతో కలిసి రెండు గొంతులతో వైవిధ్యంగా పాడారు జానకమ్మ. ఈ రెండు గొంతులలో ఒకటి పదేళ్ల బాలుడైతే, మరోటి మూడేళ్ల వయసుగల బాబు కావడం విశేషం. మూడేళ్ల బాబు పాడినప్పుడు ఆ గొంతులో స్వరాలు కుదురుకోవు కాబట్టి శ్రుతిలో కాకుండా మామూలుగా పాడారు. కాస్త పరిణతి చెందాక శ్రుతి, లయ మాధుర్యం 
ఉంటాయి. ఈ వైవిధ్యాన్ని జానకమ్మ ఎంతో ప్రతిభతో చూపించారు. 
 
గోదావరి గల గలలలా...: 1964లో ‘పూజాఫలం’ సినిమాలో ఘనం శీనయ్య రాసిన ‘పదం’ ను కురంజి రాగంలో ఎస్‌. రాజేశ్వరరావు స్వరపరచగా జానకమ్మ సశాస్త్రీయంగా పాడారు. ఈ పదంలో ‘శీలమింతైన విడువ జాలను రా’ అన్న పంక్తిలో జానకమ్మ గాత్ర గమకాలు గోదావరి గల గలలను మించి జాలువారాయి. 

రాజ ఓ రాజ...: ‘చిలక జోస్యం’ (1983 ) సినిమాలో కేవీ మహదేవన్‌ సంగీతంలో బాలు, జానకి పాడిన ‘రాజ ఓ రాజ ఓ బాలరాజా..’ నవ్వుల వానలో ముంచెత్తించింది. ఈ పాటలో అల్లు రామలింగయ్య, రమాప్రభ అభినయించారు. వీటూరి రాసిన ఈ పాటలో ‘లైలాను నేను మజ్నూవు నీవు... మన ప్రేమ నగరు మాయా బజారు, యమగోల’ అని సాహిత్యమంతా అక్కినేని, ఎన్‌.టి.ఆర్‌ నటించిన చిత్రాల పేర్లతో రూపొందించింది కావడం విశేషం. పాటలో... ‘నీ కులుకులు, నీ తళుకులు, గిలి గిలి’ అన్నపుడు జానకమ్మ మత్తుగా నవ్విన తీరు పాటకు బోనస్‌. ‘శివ’ (1989) సినిమా కోసం ఇళయరాజా స్వరపరచిన ‘సరసాలు చాలు శ్రీవారు’ పాటలో జానకమ్మ ఎక్స్‌ప్రెషన్స్  శృంగార రస తరంగాలలో ఓలలాడించే విధంగా ఉన్నాయి.

హమ్మింగ్‌లో అభివ్యక్తులు: కొన్ని పాటల్లో ఒక్కోసారి నాయకుడు మాత్రమే పాటను ఆలపిస్తుంటాడు... నాయిక హమ్మింగ్‌ చేస్తుంది. తెలుగు సినిమాలలో జానకమ్మే ఈ హమ్మింగ్‌లను పాడటం విశేషం. అంతేకాదు... ఆ... ఊ...  ఆహా... ఓహో అని మాత్రమే అంటూ భావాన్ని వ్యక్తం చేసిన ఘనత ఆమెది. ‘సిరి సంపదలు’ (1964) చిత్రంలో ఘంటసాలతో పాడిన ‘ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ..’ అని ప్రశ్నిస్తే, హీరో వెంటనే ‘వింత కాదు, నా చెంత నా ప్రియురాలు ఉండటమే సుమీ’ అని జవాబు చెప్పి సమర్థించుకొంటాడు. ఈ పాటలో ప్రశ్నకు...  జవాబుకు సైతం జానకమ్మ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్  వర్ణనాతీతం. 

ఆలాపనలో ఆకర్షణలు...: ‘రావణుడే రాముడైతే’ (1978) చిత్రంలో జీకే వెంకటేశ్‌ సంగీతంలో ‘రవివర్మకే అందని ఒకే ఒక అందానివో’ పాట జానకమ్మ ఆలాపనతో మొదలవుతుంది. పాట తాలూకు ప్రతి చరణాంతంలో ఆమె తారా స్థాయిలో (సా..ని ని పా..ప ని రీ) చేసిన ఆలాపన రవి వర్మ చిత్రాన్ని స్వరచిత్రం చేస్తుంది. ‘ఆకలి రాజ్యం’ (1980)లో ‘తన్న నన్న నాన తన్న నన్న’ అని ట్యూన్‌ మాత్రమే ఇస్తూ హీరో పాట సాహిత్యాన్ని రాయించే గీతంలో పాట ఆద్యంతం నాయిక భావాలకు తగ్గట్టుగా నాయ కుడు సాహిత్యాన్ని ఎలా అందిస్తాడోనని ఆసక్తి కలుగుతుంది. 

పడుచు పిల్ల... ముసలి అవ్వల గాత్రానుకరణ...: ‘శ్రీవారికి ప్రేమ లేఖ’ (1984) కోసం రమేశ్‌ నాయుడు స్వరపరచిన పాటలో నాయిక ప్రేమలేఖ రాస్తూ ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అంటూ సాగే పాటలో ఊర్పులు, నిట్టూర్పులను జానకమ్మ పలికించిన తీరు మాటలకందనిది. ‘శ్రీవారి శోభనం’ (1985) చిత్రంలో వేటూరి రాసిన ‘అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక’ పాటను రమేశ్‌ నాయుడు సంగీతంలో అటు పడుచు పిల్ల వలె ఇటు ముసలి అవ్వ వలె గొంతు మారుస్తు పాడటం జానకమ్మకే చెల్లింది.

వీణలో లీనమైన గానం: ‘ఓ వీణ చెలి నా ప్రియ సఖి’ (చంద్రహాస 1965) వంటి వీణ పాటలు జానకమ్మ గాత్ర వైవిధ్యానికి మెచ్చు తునకలు. హనుమంత రావు స్వరపరచిన ఈ గీతంలో జానకమ్మ వీణతో పోటీ పడి పాడారు. ఇక నవరసభరితమైన గీతాలలో.. ‘ఇల్లు ఇల్లాలు’ (1972) చిత్రంలో కేవీ మహదేవన్‌ సంగీతంలో ‘వినరా సూరమ్మ కూతురు మగడా...’ అంటూ జానకమ్మ, రాజబాబు పాడిన హాస్య గీతం ఆల్‌ టైం హిట్‌ అయింది. అప్పలాచార్య రాసిన ఈ పాట బుర్ర కథలాగా మొదలవుతుంది.

ఎదలో లయ ఎగసే...: ‘నీరాజనం’ (1988)లో ఓపీ నయ్యర్‌ సంగీతంలో సినారె రాసిన ప్రణయ గీతం ‘నిను చూడక నేనుండలేను’లో బాలు గాత్రానికి దీటుగా జానకమ్మ ఆలాపనలు స్వరామృత గుళికలే. ‘అన్వేషణ’ (1985) చిత్రంలో వేటూరి రాసిన ‘ఎదలో లయ ఎగసే లయ’ పాట పాడిన తీరు గురించి రాయడానికి పదాలు లేవు. ఈ సన్నివేశానికి గాను ఇళయరాజా స్వరకల్పనలో జానకమ్మ పాడిన తీరు అలరిస్తుంది. 

ఇలా జానకమ్మ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు... ఆమె ఓ ప్రవహించే జీవనది ... ఆ నదిలో నుంచి ఎంతైనా స్వీకరించవచ్చు... అనుభూతికి ఆకాశమే హద్దు.

– డాక్టర్‌ వి.వి. రామారావు
(రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement