
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. చాలా మంది సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయంగా మంచి స్థానంలో ఉన్నారు. అలా కోట శ్రీనివాసరావు కూడా సినిమాలతో బీజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చాడు. ఎమ్యెల్యే కూడా అయ్యాడు. కానీ సడెన్గా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.
(చదవండి: కోట శ్రీనివాసరావు మరణం.. బోరున విలపించిన బాబు మోహన్)
అలా రాజకీయాల్లోకి..
కోట శ్రీనివాసరావుకి బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్పేయి అంటే చాలా ఇష్టం. అందుకే అప్పట్లో సీనీ నటులు ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరితే.. కోట మాత్రం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట ఓటమి చవిచూశాడు. అయినా బీజేపీ నాయకత్వం కోటని కీలక నేతగానే పరిగణించింది. కానీ కొన్నాళ్ల తర్వాత కోటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు.
(చదవండి: 30 ఏళ్లపాటు కోటను గుర్తుపట్టని భార్య.. కూతురిని రిక్షా గుద్ది, కొడుకేమో.. ఒంటరిగా కన్నీళ్లు!)
అందుకే రాజకీయాలు వదిలేశా: కోట
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోట ఇక రాజకీయంగానే స్థిరపడతారని, సినిమాలకు దూరమైనట్లేనని అంతా భావించారు. కానీ కోట మాత్రం సినిమాలను వదులుకోలేదు. రాజకీయంగా సేవ చేయాలని తనకు ఉన్నా..అక్కడ పరిస్థితులు నచ్చకపోవడంతో ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని ఫిక్స్ అయ్యారట. ఈ విషయాన్ని గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా కోట శ్రీనివాసరావే చెప్పారు.
‘1999లో ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు వాతావరణం వేరు. అప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేది. మంచి పని చేశాడు అనిపించుకోవాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కావాలి. 20-30 కోట్లు ఖర్చుపెట్టాలి అనే మాటలు వినబడుతున్నాయి. నా ప్రశ్న ఒక్కటే. అంత మొత్తం ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అందుకే రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించే నా తత్వానికి ఇక పడవు అనుకుని రాజకీయాలు వదిలేశాను’ అని కోట అన్నారు.