
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం(ఏప్రిల్ 22)జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) నుంచి ప్రముఖ టెలివిజన్ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం తృటిలో తప్పించుకున్నారు. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్‌తో పాపులర్ అయిన నటి దీపికా తన భర్త షోయబ్, కుమారుడు రుహాన్‌తో కలిసి కశ్మీర్‌లో విహార యాత్రకు వెళ్లారు. పర్యటనలో భాగంగా పహల్గాంకు కూడా వెళ్లారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో..దాడి సమయంలో వారు కూడా అక్కడే ఉన్నారేమోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే దాడి కంటే ముందే ఈ జంట కశ్మిర్ నుంచి ఢిల్లీకి చేరుకుంది.
ఈ విషయాన్ని షోయబ్ ఇబ్రహీం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ‘అందరికి హాయ్, మా గురించి మీరంతా ఆందోళన చెందుతున్నారు. మేము సురక్షితంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే మేము కశ్మీర్ నుంచి బయల్దేరి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాం. ఎవరూ ఆందోళన పడకండి’ అని ఆయన పేర్కొనడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అయితే షోయబ్ పోస్ట్‌పై కొంతమంది నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. సురక్షితంగా ఢిల్లీకి చేరామని చెబుతూనే.. ఈ పర్యటనపై వ్లాగ్ చేశామని, అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఒకవైపు ఉగ్రదాడితో దేశమంతా బాధపడుతుంటే.. వ్లాగ్ గురించి ప్రచారం చేసుకోవడం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ విషాద సమయంలో వ్లాగ్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు అత్యంత ఘోరంగా దాడి చేశారు. మ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చిన పర్యటకులపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ దాడి చేసింది తామేనంటూ లష్కరే ముసుగు సంస్థ టీఆర్‌ఎఫ్ ప్రకటించింది.