రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న కన్నడ నటి పవిత్ర గౌడకు జైలులో మరోసారి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆమెను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులోని ఒక బ్యారక్ నుంచి మరో బ్యారక్‌కు తరలించినట్లు సమాచారం. ఇద్దరు ఖైదీలు మాత్రమే ఉన్న బ్యారక్‌లో ఉన్న పవిత్ర గౌడను.. ఏకంగా 16 మంది ఖైదీలు ఉన్న బ్యారక్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. జైలులో భద్రతా చర్యలను కఠినతరం చేసిన నేపథ్యంలోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఇటీవల మాజీ ఎంపీ ప్రజ్జ్వల్ రేవన్న ఉన్న బ్యారక్‌లో మొబైల్ ఫోన్ లభ్యమైన విషయం తెలిసిందే. ఈ వార్త వైరల్ కావడంతో, జైలు నిబంధనలకు విరుద్ధంగా మొబైల్ ఫోన్ ఎలా లోపలికి వెళ్లిందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటన తర్వాత జైలులోని ఖైదీల కదలికలపై నిఘాను మరింత పెంచినట్లు తెలుస్తోంది.
డీజీపీ అలోక్ కుమార్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలును సందర్శించి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. జైలు పరిసరాలు, ఖైదీల బ్యారక్‌లు, భద్రతా వ్యవస్థను పరిశీలించిన అధికారులు.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటి పవిత్ర గౌడను కూడా మరో బ్యారక్‌కు తరలించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఇద్దరు ఖైదీలు ఉన్న బ్యారక్‌లో ఉన్న ఆమెను 16 మంది ఖైదీలు ఉండే బ్యారక్‌కు మార్చడం చర్చనీయాంశంగా మారింది. అయితే పవిత్ర గౌడను ఈ విధంగా బదిలీ చేయడానికి సంబంధించిన అధికారిక కారణాలు పూర్తిగా వెల్లడికావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌తో పాటు పవిత్ర గౌడపై కూడా ఆరోపణలు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు సమయంలో వెలుగులోకి వచ్చిన అంశాలు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం కేసు న్యాయపరమైన ప్రక్రియలో ఉండగా.. జైలు అధికారులు భద్రత విషయంలో ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


