Bigg Boss 5 Telugu: ఉమాపై గెలుపు, ఏడుస్తూనే ట్విస్ట్‌ ఇచ్చిన లోబో!

Bigg Boss Telugu 5: Lobo Win Single Bed - Sakshi

Bigg Boss Telugu 5, Episode 12: కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ఏమోగానీ అరుపులు, కొట్లాటలు, ఒకరి మీద ఒకరు పడటాలు, మల్లయుద్ధాలు, కుస్తీ పోటీలతో బిగ్‌బాస్‌ హౌస్‌ భయానకంగా మారిపోయింది. దీంతో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల ఆవేశాలను చల్లార్చేందుకు మరో టాస్క్‌ ప్రవేశపెట్టాడు. అప్పటిదాకా శివమూగిన కంటెస్టెంట్లు ఇందులో మాత్రం తెగ నవ్వించారు. మరి నేటి(సెప్టెంబర్‌ 16వ) ఎపిసోడ్‌లో ఏమేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

చాక్లెట్లతో సర్‌ప్రైజ్‌ చేసిన బిగ్‌బాస్‌
కెప్టెన్సీ పోటీదారులను ఎంచుకునే క్రమంలో బిగ్‌బాస్‌ 'అగ్గిపుల్లా మజాకా' టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో రెండు టీమ్స్‌ తమ తమ బాక్సుల్లోని ఇసుకలో అగ్గిపుల్లలు ముట్టించి చివర్లో ఉన్న కర్పూరం అంటుకునేలా చేయాల్సి ఉంటుంది. ఈ టాస్కులో పర్పుల్‌ టీమ్‌ గెలవడంతో జెండా లభించింది. ఓవరాల్‌గా 'పంతం నీదా నాదా' టాస్క్‌ ముగిసే సమయానికి గద్ద టీమ్‌ ఆరు, నక్క టీమ్‌ ఐదు జెండాలు సాధించింది. దీంతో గద్ద టీమ్‌ గెలిచిందని స్పష్టమవుతోంది. అనంతరం హౌస్‌లో శ్వేత బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు. ఈ సందర్భంగా శ్వేత తండ్రి విషెస్‌ చెప్పిన వీడియోను బిగ్‌బాస్‌ ప్లే చేయడంతో ఆమె ఎమోషనల్‌ అయింది. తర్వాత బిగ్‌బాస్‌ ఇంటిసభ్యుల కోసం చాక్లెట్లు పంపి సర్‌ప్రైజ్‌ చేశాడు. ఇదిలా వుంటే రాత్రిపూట గిన్నెలు కడుగుతున్న మానస్‌కు సాయం చేయడానికి వచ్చింది లహరి. ఆ తర్వాత అతడిని బెడ్‌ దాకా రమ్మని చెప్పి హగ్గులిచ్చాక గుడ్‌నైట్‌ చెప్పింది.

కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి
ఉమా, లోబోల రొమాన్స్‌ చూడలేకపోయారు హౌస్‌మేట్స్‌. అందరికన్నా నువ్వే అందంగా ఉన్నావంటూ ఉమాకు సోపేశాడు లోబో. దీంతో పడిపోయిన ఉమా.. అతడికి స్పూన్‌తో తినిపిస్తూ చేతులు తడిమింది, హత్తుకుంది కూడా! ఇది చూసిన రవి.. మీది యాక్టింగ్‌ అని తెలిసిపోతుందిలే అని గాలి తీసేశాడు. గద్ద టీమ్‌ కెప్టెన్‌ శ్రీరామచంద్ర.. విశ్వ, యానీ మాస్టర్‌, పింకీ, హమీదాలను కెప్టెన్సీకి పోటీదారులుగా ప్రకటించాడు. వీరికి బిగ్‌బాస్‌.. 'కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి' అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో హౌస్‌మేట్స్‌ కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నారో వారి బీకర్లలో కొబ్బరికాయ నీళ్లు నింపాల్సి ఉంటుంది. ఎవరి బీకరు ముందుగా నిండితే వాళ్లు కెప్టెన్‌ అయినట్లు లెక్క! ఈ టాస్కులో విశ్వ గెలిచి సెకండ్‌ కెప్టెన్‌గా నిలిచాడు.

హమీదా స్మార్ట్‌, హాట్‌, క్యూట్‌.. అంటున్న షణ్ముఖ్‌
షణ్ముఖ్‌లోని మరో కోణాన్ని బట్టబయలు చేశాడు యాంకర్‌ రవి. హౌస్‌లో హమీదా స్మార్ట్‌, హాట్‌, క్యూట్‌, ఇంటెలిజెంట్‌ అని నాతో అన్నావ్‌ కదా అని అందరి ముందే షణ్ముఖ్‌ను అడిగేశాడు. చెల్లెలు కూడా అన్నావనగానే ఆ మాట మాత్రం అనలేదు, తాము ఫ్రెండ్స్‌ అని చెప్పాడు. దీంతో అవాక్కైన రవి.. షణ్ముఖ్‌ ఎంతో ఇష్టపడే పిల్లో మీద S(షణ్ముఖ్‌), D(దీప్తి సునయన)తో పాటు H(హమీదా) కూడా రాద్దామని జోక్‌ చేశాడు. అయితే హమీదా మాత్రం.. దీప్తి పేరు తీసేసి తన పేరు రాసుకోమంది, కావాలంటే బయటకెళ్లాక మళ్లీ దీప్తి పేరు రాసుకోమని సలహా ఇవ్వడంతో అక్కడున్న రవి, లహరి నోరెళ్లబెట్టారు. అయితే చివర్లో మాత్రం ఫ్రెండ్‌షిప్‌ అంటూ కవర్‌ చేసింది హమీదా.

ఆనందంతో పూల్‌లో మునకేసిన లోబో
ఇక ఇంట్లో సింగిల్‌ బెడ్‌ దక్కించుకునేందుకు ఉమ, లోబోకు ప్రత్యేక టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. వీళ్లిద్దరిలో ఎవరు ఎక్కువ నవ్విస్తే వాళ్లకు ఆ బెడ్‌ సొంతమని చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన లోబో.. పింకీతో కలిసి స్కిట్‌ వేసి కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత వచ్చిన ఉమాదేవి.. సిరితో కలిసి అత్తాకోడళ్ల స్కిట్‌ వేసి కామెడీ పండించింది. కానీ దీనికోసం లోబోను బర్రె, జెస్సీని ఆవుతో పోల్చడం సరికాదనేది పలువురి అభిప్రాయం. మొత్తానికి ఈ కామెడీ స్కిట్‌లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న లోబో విజేతగా నిలిచాడు. దీంతో ఆనందం ఉండబట్టలేక అతడు ఏకంగా స్విమ్మింగ్‌ పూల్‌లో మునకేశాడు. ఇన్నాళ్లు నేలపై పడుకున్న తనకు సింగిల్‌ బెడ్‌ లభించడంతో ఎమోషనల్‌ అయిన లోబో కన్నీళ్లతో హౌస్‌మేట్స్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు. తనేదైనా తప్పు చేస్తే క్షమించమని కోరాడు. తను గెలిచిన బెడ్‌ను ఉమాదేవికి అందించాడు.

షణ్ను బర్త్‌డే సెలబ్రేషన్స్‌
ఆ తర్వాత హౌస్‌లో షణ్ముఖ్‌ బర్త్‌డే సెలబ్రేట్‌ చేశారు. ఈ సందర్భంగా వాళ్ల పేరెంట్స్‌విషెస్‌ తెలిపిన వీడియో ప్లే చేశాడు బిగ్‌బాస్‌. అనంతరం ప్రేయసి దీప్తి సునయన ఐ లవ్‌యూ చెప్పిన వీడియో ప్లే చేయడంతో అతడి కళ్లలో నీళ్లు తిరగ్గా అందరూ తనను ఓదార్చారు. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్‌ ఏ గొడవా లేకుండా కొనసాగింది. మరి రేపటి లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో బిగ్‌బాస్‌ వీళ్ల మధ్య మళ్లీ అగ్గి రాజేస్తాడేమో చూడాలి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top