
ఒక్క పాటతో ఫేమస్ అయిన యువకుడు రాము రాథోడ్. ఆ ఒక్క సాంగ్ అతని జీవితాన్నే కాదు.. కుటుంబ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన రాము రాథోడ్.. రాను బొంబాయి రాను అంటూ ఫోక్ సాంగ్ ప్రియులను ఓ ఊపు ఊపేశాడు. ఈ పాటతో డబ్బులు సంపాదించడమే కాదు.. ఏకంగా బిగ్‌బాస్ ఛాన్స్ వచ్చేలా చేసింది. ఈ ఏడాది తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు రాము రాథోడ్. ఈ సందర్భంగా తమ కుమారుడికి దక్కిన ఘనతపై రాము రాథోడ్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాము రాథోడ్ బిగ్‌బాస్‌కు వెళ్లిన తర్వాత రాము రాథోడ్ పేరేంట్స్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మా కష్టాలు చూసిన రాము.. ఇప్పుడు మమ్మల్ని సంతోషంగా చూసుకుంటున్నాడని సంతోషం వ్యక్తం చేశారు. రాను బొంబాయికి రాను.. అనే పాట రాయడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. పుణె, ముంబయిలో మేము పడిన కష్టాలను చూసిన రాము రాథోడ్‌కు.. ఈ పాట రాయాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.
మేము పెంకుటిల్లులో ఉండేవాళ్లమని.. చాలా పేదరికంలో బతికామని వెల్లడించారు. సెలవుల్లో పుణె, ముంబయికి వచ్చి మాతో పాటు రాము కూడా పనులు చేశాడని తల్లిదండ్రులు తెలిపారు. ముంబయిలో కూడా హిందీ పాటకు డ్యాన్స్ చేస్తే కప్పు కూడా వచ్చిందన్నారు. అప్పటి నుంచి రాముకు మేమే టీవీ, టేప్ రికార్డర్, సౌండ్ బాక్స్ కొనిచ్చి ఇంటివద్దనే విడిచి ముంబయికి వెళ్లామని అన్నారు.
లాక్ డౌన్‌లో రాము ఈ పాటలను రాయడం మొదలు పెట్టాడని పేరేంట్స్ తెలిపారు. నువ్వు వేరే పనిచేయలేవు.. నీకు నచ్చింది పని చేస్కో అన్నామని అతని తల్లి తెలిపింది. ఫస్ట్ సొమ్మసిల్లి అనే సాంగ్ రాశాడని వెల్లడించింది. ఆ తర్వాత చాలా పాటలు రాశాడని పేర్కొంది. అలా తన పాటలు మొదలెట్టిన రాము రాను బొంబాయికి రాను.. అంటూ సాంగ్‌తో ఫేమ్ తెచ్చుకోవడమే కాదు.. తన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపాడు.
కాగా.. 'సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ' సాంగ్‌ను కూడా రాము రాథోడ్ రచించడమే కాకుండా ఆలపించాడు కూడా.. 2022లో రిలీజైన ఈ పాట 290+ మిలియన్ (29 కోట్లకుపైగా) వ్యూస్ సాధించింది. అప్పట్లో ఈ సాంగ్ యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్.. అందుకే ఇదే సాంగ్‌ను ‘మజాకా’ సినిమాలో రీ క్రియేట్ చేశారు.