
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్‌ను చంపేసినట్లుంది కథ! హౌస్‌లో గుడ్డు దొంగతనం చేసింది సంజనా.. ఆ గుడ్డును కాపాడుకోవాల్సింది ఓనర్లు. సంజనా ఐదు నెలల బాలింత కావడంతో ఆ దొంగతనాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు భరణి. అంతే, దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇప్పటికీ అదే పాయింట్ లాగుతూ ఓనర్లందరూ కలిసి భరణిని నామినేట్ చేశారు. మరి ఈ రెండోవారం నామినేషన్స్‌లో ఎవరున్నారో చూసేద్దాం..
తలతిక్క సమాధానాలు
నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాస్క్ మ్యాన్ హరీశ్‌ను రీతూ చౌదరి (Rithu Chowdary) నామినేట్ చేసింది. నేను తినను, వెళ్లిపోతాను అని గివప్ ఇవ్వడం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అదే అన్నం మీ ఎదురుగా మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. ఫ్యామిలీ గురించి ఆలోచించైనా తినొచ్చుగా.. అంది. దీనికి హరీశ్ తలతిక్క సమాధానం చెప్పాడు. నా జీవితం.. నాకు నచ్చినట్లు బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు. బలమైన కారణం వల్లే ఫుడ్ తినడం లేదు. నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి.
నాపై ముద్ర వేశారు
నేను చరిత్రహీనుడని ముద్రవేశారు కదా.. దాన్నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి క్విట్ అవుతా అన్నాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని ప్రూవ్ చేయాలని రీతూ అంది. అప్పటికీ తగ్గని హరీశ్ (Mask Man Harish) టాపిక్‌ను డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడాడు. నీకు ఫుడ్ పెట్టడం వల్లే గొడవలనడంతో రీతూ ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సింపతీ కార్డ్ అన్నాడు హరీశ్. అలాగైతే అన్నం తినకపోవడం కూడా సింపతీ కార్డే అని రీతూ ఇచ్చిపడేసింది.

దమ్ముంటే బిగ్‌బాస్‌ను అడగండి
తర్వాత శ్రీజ కూడా హరీశ్‌ను నామినేట్ చేసింది. మీరు ఇమ్మాన్యుయేల్‌ను రెడ్ ఫ్లవర్ అనడం వీడియోలో క్లియర్‌గా కనిపించిందని శ్రీజ చెప్తుంటే ఇమ్మాన్యుయేలే బాడీ షేమింగ్ చేశాడంటూ హరీశ్ మళ్లీ ఫైరయ్యాడు. మా మధ్య ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపో అనేసింది శ్రీజ. దమ్ముంటే బిగ్‌బాస్‌ను అడగండి, పంపిస్తే వెళ్లిపోతా అన్నాడు. ఇలా గొడవలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. చివర్లో బిగ్‌బాస్ కెప్టెన్ సంజనాకు ఓ పవర్ ఇచ్చాడు. ఒకర్ని నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు.
సుమన్‌ను బలి చేసిన కెప్టెన్ సంజనా
దీంతో ఆమె.. ఆరోజు నేను ఏడుస్తున్నప్పుడు మేము 9 మంది కాదు 8మందిమే అని నన్ను పక్కనపెట్టేశారు. తర్వాత ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు అంటూ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అందుకతడు.. ఆ తొమ్మిదో వ్యక్తి మీరే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? నేను అయ్యుండొచ్చుగా అని కౌంటరిచ్చాడు. ఇక ఫైనల్‌గా భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. మరోవైపు లైవ్‌లో తనూజ ఎంతో బతిమాలడంతో అప్పుడు అన్నం ముద్ద తిన్నాడంట హరీశ్!
చదవండి: 'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక అసలు నిజం చెప్పిన పేరేంట్స్!