
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో కామనర్స్ కామన్ సెన్స్ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వీళ్లను ఓనర్లను చేయగానే నిజమైన ఓనర్లలా తెగ ఫీలైపోతున్నారు. టెనెంట్స్/సెలబ్రిటీలతో కావాల్సినన్ని పనులు చేయించుకుంటూ వారితోనే చీటికిమాటికి గొడవలు పడుతున్నారు. అలా ఈ వారం చాలా గొడవలు జరిగాయి. వాటన్నిటి లెక్కలు సరిచేసేందుకు శనివారం ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) వచ్చేశాడు.
కామనర్స్‌కు క్లాస్ పీకిన నాగ్
సంజనా గల్రానీ, ఫ్లోరా సైనీ మధ్య ఏర్పడిన విభేదాలను క్లియర్ చేశాడు. ఫ్రీ బర్డ్, బ్యాక్ బిచ్చింగ్ అనేవి తప్పు పదాలు కావని క్లారిటీ ఇచ్చాడు. తనూజ వంట చేస్తుంటే మధ్యలో వేలు పెట్టి దాన్ని నాశనం చేసి.. చివరకు ఆ తప్పును తనూజ మీదకే నెట్టేసిన కామనర్స్ ప్రియ, శ్రీజలకు క్లాస్ పీకాడు. అలాగే గుండు అంకుల్ కామెంట్‌పై పెద్ద చర్చే జరిగింది. ఇమ్మాన్యుయేల్ నిన్ను గుండంకుల్ అనడం తప్పే, మరి దానికంటే ముందు రెడ్ ఫ్లవర్ అని నువ్వు అనడం తప్పు కాదా? అని మాస్క్ మ్యాన్ హరీశ్‌ను నిలదీశాడు నాగ్.
రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా?
అందుకతడు తను దురుద్దేశంతో ఆ మాట అనలేదని కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. అలాగైతే గుండంకుల్ కూడా సరదాగా అన్నాడనుకోవచ్చుగా అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు నాగ్. అగ్నిపరీక్ష కోసం గుండు చేయించుకున్నా.. అలాంటిది నాపై జోక్ వేస్తే తీసుకోను, బార్డర్ క్రాస్ చేస్తే ఊరుకోను అని పెద్ద లెక్చర్ ఇచ్చాడు హరీశ్. గుండంకుల్ అన్నందుకు ఇమ్మాన్యుయేల్‌తో సారీ చెప్పించుకున్నావ్.. మరి రెడ్ ఫ్లవర్ అన్నందుకు నువ్వు సారీ చెప్పాల్సిన పని లేదా? అని ప్రశ్నించాడు.

వీడియో బయటకు లాగిన నాగ్
అప్పటికే ముఖంలో నెత్తురు చుక్క లేని హరీశ్ (Haritha Harish).. సారీ బ్రదర్, అవసరం అయితే ఈ షో నుంచి వెళ్లిపోతా అని అసందర్భంగా మాట్లాడాడు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా హరీశ్ గురించి ఓ వీడియో ప్లే చేశాడు నాగ్. అందులో హరీశ్.. 'ఇమ్మాన్యుయేల్ ఆడాళ్లతో అయితేనే మాట్లాడతా అన్నాడు. నేను ఇప్పుడు ముగ్గురు ఆడాళ్లతో మాట్లాడా.. తనూజ, ఇమ్మాన్యుయేల్, భరణి.. ఈ ముగ్గురు ఆడాళ్లతో ఫైట్ చేశానని నాకిప్పుడు అర్థమైంది' అని మాట్లాడాడు. ఇందులో ఆడాళ్లపై హరీశ్‌కు చిన్నచూపు ఉందని క్లియర్‌గా అర్థమైందని రీతూ తప్ప హౌస్ అంతా ముక్తకంఠంతో చెప్పింది.
అడ్డంగా వాదించిన మాస్క్ మ్యాన్
కానీ మోనార్క్ హరీశ్ మాత్రం.. ఆడాళ్లను తక్కువ చేయలేదన్నాడు. పైగా.. నాపై ఆరోపణలు చేసి నా క్యారెక్టర్‌ను రాంగ్‌గా చిత్రీకరిస్తున్నారు అని హౌస్‌మేట్స్‌తో పాటు నాగ్‌పైనా ఆవేశపడ్డాడు. ఆ మాటతో నాగ్.. ఎవరు రాంగ్ సెట్ చేస్తున్నారు? అని ఫైర్ అయ్యాడు. అక్కడున్న లైవ్ ఆడియన్స్‌ని అడగ్గా వారు కూడా.. హరీశ్ ఫ్లిప్ అవుతున్నాడని చెప్పడంతో మాస్క్ మ్యాన్ దండం పెట్టేశాడు. ఎవరెన్ని చెప్పినా హరీశ్ మాత్రం తలపొగరుతో తను చెప్పిందే కరెక్ట్ అని అడ్డంగా వాదించాడు.
చదవండి: ‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది: మంచు మనోజ్