
‘‘ప్రస్తుతం థియేటర్స్ అన్నీ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా హిట్ అయింది. బెల్లంకొండ సాయి ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మా ‘మిరాయ్’ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నెక్ట్స్ ‘దక్ష’ చిత్రం రాబోతోంది. ఆ తర్వాత ‘ఓజీ’ మూవీ వస్తోంది. ఈ నెల మూవీ లవర్స్‌కు ఫీస్ట్‌లా ఉంటుంది. అన్ని సినిమాలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అని హీరో మంచు మనోజ్ తెలిపారు.
మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో, మంచు మోహన్‌బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’. వంశీకృష్ణ మల్లా దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మంచు మనోజ్ మాట్లాడుతూ– ‘‘దక్ష’ కోసం మా అక్క లక్ష్మి చాలా కష్టపడింది. మా నాన్న, అక్క కలిసి నటించిన ‘దక్ష’ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ–‘‘నాన్నగారి తర్వాత నన్ను అంత బాగా చూసుకునేది మనోజ్. మనోజ్ హీరోగానే కాదు... విలన్‌గానూ మెప్పించగలడు, కామెడీ చేయగలడు. వర్సెటైల్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. మా ‘దక్ష‘ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీ వాళ్లు పంపిణీ చేస్తున్నారు’’ అని చెప్పారు. ‘‘దక్ష’ ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. విష్ణు అన్న ‘కన్నప్ప’, మనోజ్ అన్న ‘మిరాయ్’ సక్సెస్ అయినట్లే లక్ష్మి అక్క ‘దక్ష’ కూడా విజయం సాధించాలి’’ అన్నారు వంశీకృష్ణ మల్లా.