ప్రతి సీజన్‌లో ఒకే ఒక్క టికెట్ టు ఫినాలే ఉంటుంది. కానీ తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్‌లో మాత్రం రెండో టికెట్ టు ఫినాలే ప్రవేశపెట్టడం.. దానికోసమే ఈ వారమంతా టాస్కులు ఆడించడం జరిగింది. తీరా ఫైనలిస్ట్ అయ్యే అవకాశం చేతిదాకా వస్తే తనకు అక్కర్లేదని తిరస్కరించింది తనూజ. ఆ విశేషాలు శుక్రవారం (డిసెంబర్ 12వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం..
బుర్ర ఉపయోగించిన భరణి
లీడర్ బోర్డులో చివర్లో ఉన్న భరణి.. తన సగం పాయింట్స్ ఒకరికి ఇచ్చేయాలన్నాడు బిగ్‌బాస్. సంజనాకు పాయింట్స్ ఇచ్చేస్తే తనకు ఫినాలేకు వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయని భావించి బుర్ర ఉపయోగించిన భరణి.. తనూజకు ఇచ్చాడు. కానీ, ఆ పాయింట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం నువ్వు నా కూతురివి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇమ్మూ గెలుపు
తర్వాత మిగిలిన ముగ్గురు సంజనా, తనూజ, ఇమ్మాన్యుయేల్.. కీ టూ సక్సెస్ అనే గేమ్ ఆడారు. ఇందులో ముగ్గురూ కష్టపడ్డారు. సంజనా మాటలు జారడంతో ఇమ్మూ ఎమోషనలయ్యాడు. ఈ గేమ్‌లో ఇమ్మూ గెలవగా, సంజనా రెండో స్థానంలో, తనూజ మూడో స్థానంలో నిలిచింది. తర్వాత గేమ్‌లో అందరూ కలిసి సంజనాను ఆడకుండా సైడ్ చేశారు.

చివరి గేమ్‌లో తనూజ విజయం
అలా ఇమ్మూ, తనూజకు బాల్ గేమ్ ఇచ్చారు. ఈ గేమ్‌లో ఇమ్మూ కాలు బెణకడంతో మెడికల్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. నొప్పితో ఆడి మరీ ఇమ్మూ ఈ గేమ్ గెలిచాడు. అనంతరం తనూజ, సంజనా, ఇమ్మూకి చిట్టచివరి టాస్క్ ఇచ్చాడు. ఇందులో గెలిచినవారికి ఏకంగా 300 పాయింట్లు వస్తాయని బంపర్ ఆఫర్ ప్రకటించాడు బిగ్‌బాస్. ఈ గేమ్‌లో తనూజకు దెబ్బ తగిలిగినప్పటికీ పట్టించుకోకుండా ఆడి గెలిచింది.
తనూజతో డీల్
చివరి గేమ్‌లో ఎక్కువ పాయింట్స్ రావడంతో తనూజ ఏకంగా విజేతగా నిలిచింది. అన్ని గేమ్స్ గెలుచుకుంటూ వచ్చి చివర్లో ఓడిపోయానని ఇమ్మూ కంటతడి పెట్టుకున్నాడు. ఫైనల్‌గా లీడర్‌బోర్డులో 750 పాయింట్స్‌తో తనూజ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా.. ఇమ్మూ 520, సంజనా 320 పాయింట్లతో తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. అనంతరం తనూజను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలిచాడు.
టికెట్ టు ఫినాలే అక్కర్లేదన్న తనూజ
మీ దగ్గరున్న రూ.3 లక్షలతో ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అవొచ్చన్నాడు. ఆ డబ్బంతా విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి కట్ చేస్తానన్నాడు. ఈ ఆఫర్‌ను తనూజ రిజెక్ట్ చేసింది. ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపింది. అలా ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ఇది తనూజ విన్నింగ్ ఛాన్స్‌ను మరింత రెట్టింపు చేసే ఎపిసోడ్ అనే చెప్పవచ్చు.


