96 చిత్రం ద్వారా ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్ వెండితెరకు పరిచయమయ్యారు. 96 చిత్రంలో హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో నటించారు. ఆ మూవీ విజయంతో వీరికి మంచి గుర్తింపు వచ్చింది. ఆదిత్య భాస్కర్ ఇటీవల జాతీయ అవార్డును గెలుచుకున్న ఎంఎస్.భాస్కర్ వారసుడు అన్నది గమనార్హం. తాజాగా ఆదిత్య భాస్కర్, గౌరికిషన్ హీరో హీరోయిన్లుగా జత కట్టారు. ఈ చిత్రాన్ని ఆర్జిన్ స్టూడియోస్ పతాకంపై కన్నదాసన్ నిర్మిస్తున్నారు.
షూటింగ్ పూర్తి
ఈ మూవీ ద్వారా రాజ్‌కుమార్ రంగసామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సరస్వతి మీనన్, దర్శకుడు కె.భాగ్యరాజ్, రెడిన్ కింగ్‌స్లీ, డీఎస్‌ఆర్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు వెల్లడించాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న కథా చిత్రం అని చెప్పారు.
96 మ్యాజిక్ రిపీట్!
జనరంజకమైన అంశాలతో కుటుంబ సమేతంగా చూసి ఆనందించే విధంగా ఈ మూవీ కథ ఉంటుందన్నారు. 96 చిత్రం ఫేమ్ ఆదిత్య భాస్కర్, గౌరీకిషన్‌ల మ్యాజిక్ ఈ చిత్రంతో మరోసారి వర్కౌట్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే చిత్ర టైటిల్‌ను ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఎస్.రామచంద్రన్ చాయాగ్రహణం, ఎంఎస్.జోన్స్ రాబర్ట్ సంగీతాన్ని అందిస్తున్నారు.


