‘‘ఫలానా జానర్‌లోనే సినిమాలు చేయాలని అనుకోవడం లేదు. నటుడిగా అన్ని రకాల జానర్ సినిమాలూ చేయాలనుకుంటున్నాను’’ అని రోషన్ కనకాల చెప్పారు. రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోగ్లీ 2025’. హర్ష చెముడు, బండి సరోజ్ కుమార్ కీలకపాత్రల్లో నటించారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో రోషన్ కనకాల మాట్లాడుతూ– ‘‘మోగ్లీ 2025’ హానెస్ట్ లవ్‌స్టోరీ ఫిల్మ్. ప్రేక్షకులు ఏ మాత్రం బోర్ ఫీల్ కాకుండా సందీప్ రాజ్ రేసీ స్క్రీన్‌ప్లే డిజైన్ చేశారు. తన ప్రేమకోసం మోగ్లీ ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడు. మరి... మోగ్లీ ప్రేమ కథకు వచ్చిన అడ్డంకులు ఏంటి? క్రిస్టోఫర్ నోలన్ (ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్‌పాత్ర పేరు) నుంచి మోగ్లీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనే అంశాలతో ఈ సినిమా కథ ముందుకు వెళుతుంది.
మోగ్లీ క్యారెక్టర్, ఈ సినిమా ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ కథలో కామెడీ, యాక్షన్... ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇంటర్వెల్, ప్రీ ఇంటర్వెల్ ఎంగేజింగ్‌గా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ప్రస్తుతం ఒక రొమాంటిక్ లవ్‌స్టోరీ, ఒక ఇంటెన్స్ లవ్‌స్టోరీ సినిమాలు కమిట్ అయ్యాను’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘నటన పరంగా మా అమ్మ (వ్యాఖ్యాత–నటి సుమ కనకాల), నాన్న (నటుడు రాజీవ్ కనకాల)ల సలహాలను అవసరమైనప్పుడు తీసుకుంటుంటాను’’ అని తెలిపారు.


