తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ (Bigg Boss Telugu 9) మొదలై 50 రోజులవుతోంది. ఇప్పటికీ అసలు సిసలైన విన్నింగ్ క్యాండిడేట్ వీళ్లే.. అనేలా ఒక్కరూ లేరు. అంతో ఇంతో తనూజపై హైప్ ఉంది. కల్యాణ్ కూడా నెగెటివిటీని పాజిటివిటీగా మార్చేసుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ ఆల్‌రౌండర్.. కానీ, అసలు నామినేషన్స్‌లోకే రాకపోవడం తనకే పెద్ద మైనస్ అవుతోంది.
రీఎంట్రీ
ఇంతలో ఆటను మరింత రసవత్తరంగా మార్చేందుకు రీఎంట్రీ అంటూ ఓ హైప్ తీసుకొచ్చాడు బిగ్‌బాస్. షో మొదలైన తర్వాత ఎన్ని ఎంట్రీలు వచ్చాయి! అగ్నిపరీక్ష నుంచి మూడోవారం దివ్యను హౌస్‌లోకి పంపారు. తర్వాత సంజనాను మిడ్‌వీక్‌లో ఎలిమినేట్ చేసి వీకెండ్‌లో మళ్లీ లోనికి పంపించారు. ఆ తర్వాత ఆరుగురు వైల్డ్ కార్డ్స్‌ను తీసుకొచ్చారు. వారు లోనికి వస్తూనే శ్రీజను ఎలిమినేట్ చేశారు. ఆ మరుసటి వారమే భరణి ఎలిమినేషన్ కూడా జరిగింది.
భరణికే ఎందుకు ప్రాధాన్యత?
అయితే భరణికి నిజంగానే తక్కువ ఓట్లు పడ్డాయా? అని ప్రేక్షకుల్లో కొంత అనుమానం ఉంది. అటు శ్రీజ (Srija Dammu) ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. తను రీఎంట్రీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ బిగ్‌బాస్ దాకా వెళ్లింది. కానీ, అడగ్గానే పంపితే బిగ్‌బాస్ ఎందుకవుతాడు. ఇంకేదో కొత్తగా.. కాదు, చెత్తగా ఆలోచించాడు. శ్రీజతో పాటు భరణిని హౌస్‌కి పంపించాడు. వీళ్లకు హౌస్‌లో గేమ్స్.. బయటేమో ఓటింగ్ పెట్టాడు.
ఇదేం వివక్ష?
శ్రీజను ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్‌కార్డులు అన్యాయంగా బయటకు తోసేశారు కాబట్టి తన రీఎంట్రీని పరిగణనలోకి తీసుకోవడం సమంజసం.. మరి భరణిని ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నారన్నదే ప్రశ్న! ఎలిమినేట్ అయిన మిగతా కంటెస్టెంట్లకు కూడా ఓ ఛాన్స్ ఇవ్వొచ్చుగా! ఇదే ప్రశ్న ప్రియ కూడా లేవనెత్తింది. ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన వ్యక్తికి రెండో ఛాన్స్.. మరి మేమేం పాపం చేశాం? మాకు ఆ ఛాన్స్ పొందే అర్హత లేదా? అందరినీ సమానంగా చూడాలి. అంతేకానీ ఇదేం వివక్ష? అని ఆవేదన వ్యక్తం చేసింది. తను బాధపడటంలో తప్పేం లేదు.
మళ్లీ అన్యాయం?
ఇక భరణి కోసం తనూజ ఫ్యాన్స్ ఓట్లు గుద్దిపడేస్తున్నారు. శ్రీజ హౌస్‌లోకి వస్తే కల్యాణ్‌కు ఎక్కడ పోటీ అవుతుందో అని అటు అతడి ఫ్యాన్స్ కూడా భరణికే ఓట్లేస్తున్నారట.. దీంతో ఓటింగ్‌లో భరణి లీడ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు హౌస్‌లో జరుగుతున్న గేమ్స్‌లో కూడా భరణి తన హవా చూపిస్తున్నాడట! ఈ లెక్కన బిగ్‌బాస్.. భరణిని పర్మినెంట్ హౌస్‌మేట్‌గా ప్రకటించాడని తెలుస్తోంది. దీంతో శ్రీజకు మరోసారి అన్యాయం జరిగినట్లయింది. ఓటింగ్ ద్వారా ఈసారి ప్రేక్షకులు కూడా అన్యాయం చేసినట్లే లెక్క!
చదవండి: దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్.. అల్లు శిరీష్ పోస్ట్ వైరల్


