ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. అందుకే పెళ్లీడు రాగానే వివాహం జరిపించాలని పెద్దలు ముచ్చటపడుతుంటారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చిన్న కొడుకు విషయంలో అదే ఆశపడ్డాడు. అల్లు శిరీష్‌ను పెళ్లి చేసుకోమని పదేళ్లుగా బతిమాలాడుతున్నాడు. ఎట్టకేలకు తండ్రి మాటకు తలూపి మ్యారేజ్ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు.
ఈ మధ్యే గుడ్‌న్యూస్
ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని ప్రకటించాడు శిరీష్ (Allu Sirish). తాతయ్య అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా మనసులోని మాట మీ అందరికీ చెప్తున్నా.. అక్టోబర్ 31న నయనికతో నా ఎంగేజ్‌మెంట్ జరుగుతోంది. నా పెళ్లి చూడాలని నానమ్మ ఎంతో ఆశపడింది. కానీ, ఆ కల నెరవేరకుండానే కన్నుమూసింది. తను మా మధ్య లేకపోయినా.. తన దీవెనలు ఎప్పుడూ మాకు అండగా ఉంటాయి అని శుభవార్త చెప్పాడు.
దీపావళి సెలబ్రేషన్స్‌లో..
అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్‌కు నయనిక సైతం హాజరైంది. ఆమె ఫోటోను పొరపాటున అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అప్పటికింకా శిరీష్.. తనకు కాబోయే భార్య ఫోటో రివీల్ చేయలేదని తెలిసి వెంటనే దాన్ని డిలీట్ చేసింది. ఫ్యామిలీ ఫోటోలో ఆమెను కట్ చేసి షేర్ చేసింది. రేపే నిశ్చితార్థం కావడంతో శిరీష్ కూడా ఆ పనులు చూసుకుంటున్నాడు.

ఎంగేజ్‌మెంట్‌కు వర్షం ఆటంకం
కానీ తుపాను ప్రభావం వల్ల వాతావరణంలో సడన్‌గా మార్పులొచ్చాయి. అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నాయి. శిరీష్ నిశ్చితార్థపు పనులకు సైతం ఈ వర్షాలు ఆటంకంగా మారాయి. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేసిన శిరీష్.. బయట ఎంగేజ్‌మెంట్ చేసుకుందామని ప్లాన్ చేశాం. కానీ, వాతావరణం.. దేవుడి ప్లాన్స్ మరోలా ఉన్నాయి అని రాసుకొచ్చాడు. అందులో నిశ్చితార్థపు వేదిక తడిసిముద్దయినట్లు కనిపిస్తోంది.
సినిమా
అల్లు అరవింద్ కొడుకుగా, అల్లు అర్జున్ తమ్ముడిగా శిరీష్.. 'గౌరవం' (2013) మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలు చేశాడు. ఏడాదిన్నరకాలంగా అతడి నుంచి మరే సినిమా రాలేదు.


