తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు, ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టించడంతో అందరి కన్ను టాలీవుడ్‌పై పడింది. అలా దీపికా పదుకొణె కల్కి 2898ఏడీతో తెలుగులో ఎంట్రీ ఇస్తే, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra).. #SSMB29 మూవీతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయం కానుంది. డేర్ అండ్ డాషింగ్‌గా కనిపించే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియాలో అరుదైన ఫోటోలు షేర్ చేసింది. అందులో కొండచిలువ సహా మరో భారీ పామును తన భుజాలపై వేసుకుంది. భర్త నిక్ జోనస్ కూడా పక్కనే నిల్చుని చూస్తూ ఉన్నాడు.
భయమే లేదు
వీరి ముఖంలో కంగారు, భయం వంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. పైగా.. నీ జ్యువెలరీ బాగుంది బేబ్ అని భార్యకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. పాములను మెడలో వేసుకుని దిగిన పలు ఫోటోలను తన పోస్ట్‌లో జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అదిగో పాము అనగానే అరకిలోమీటర్ దూరం పడిగెతుంటారు జనాలు.. అలాంటిది ప్రియాంక ఏకంగా పామును మెడలో వేసుకుందంటే గుండెధైర్యం చాలానే ఉందని మెచ్చుకుంటున్నారు. రాజమౌళి-మహేశ్‌బాబు సినిమాలో ఇలాంటి సాహసాలు ఎన్ని చేసిందో చూడాలని కామెంట్లు చేస్తున్నారు.
మిస్ వరల్డ్ నుంచి హీరోయిన్‌గా..
జార్ఖండ్‌కు చెందిన ప్రియాంకచోప్రా.. 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలిచింది. ఆ తర్వాతే బిగ్‌స్క్రీన్‌పై తళుక్కుమంది. 2002లో వచ్చిన తమిళన్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ద హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. అండాజ్, ముజ్‌సే షాదీ కరోగి, అయిత్రాజ్ వంటి పలు హిట్స్‌తో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారింది. క్రిష్, డాన్, ఫ్యాషన్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది.
రచయిత్రిగానూ
బర్ఫీ, బాజీరావు మస్తానీ, మేరీ కోమ్, ద స్కై ఈజ్ పింక్ ఇలా అనేక సినిమాలు చేసింది. రామ్‌లీలా సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. బాలీవుడ్ రాజకీయాలు తట్టుకోలేక హాలీవుడ్‌కు వెళ్లిపోయింది. సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లతో పాటు అనేక ఇంగ్లీష్ చిత్రాల్లో కథానాయికగా నటించింది. ‘అన్‌ఫినిష్డ్: ఏ మెమోయిర్’ పుస్తకంతో రచయిత్రిగా ఆరంగేట్రం చేసింది ప్రియాంకచోప్రా. తన జీవితంలో ఎదురైన జ్ఞాపకాలను ఈ పుస్తకం ద్వారా పాఠకులతో పంచుకుంది.
పెళ్లి- కూతురు
హాలీవుడ్ సింగర్,యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ నిక్ జోనస్‌ని 2018లో పెళ్లి చేసుకుంది. వీరికి సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరి జన్మించింది. భర్త, కూతురితో కలిసి ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లోనే ఉంటోంది. పెళ్లయ్యాక ఇండియన్ సినిమాలపై ఫోకస్ తగ్గించేసిన ప్రియాంక.. ఇప్పుడు పూర్తి స్థాయిలో మహేశ్‌బాబు–రాజమౌళి కాంబినేషన్‌లోని సినిమాలో నటించడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉంది.
చదవండి: ప్లేటు తిప్పేసిన మాధురి.. రీతూ తల్లి ఏడుస్తూ ఫోన్ చేసిందా?


